'చిత్రం' సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి, 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' తదితర చిత్రాలతో వరుస హిట్లు కొట్టి, యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు యువ హీరో ఉదయ్‌కిరణ్. ఆ తర్వాత కొన్నాళ్లకు వరుస ఫెయిల్యూర్స్ చవి చూడడం, అనుకోని కారణాలతో ఒకింత అవకాశాలు కరువయ్యాయనే డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం, చివరికి అర్ధాంతరంగా తనువు చాలించడం.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయియాయి ఉదయ్ కిరణ్ జీవితంలో. ఉదయ్‌కిరణ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు.
ఆ లోటును భర్తీ చేయడం ఎవరి వల్లా కాలేదు తర్వాత. ఉదయ్ కిరణ్ మరణంతో తెలుగు సినీ పరిశ్రమ ఓ మంచి నటున్ని కోల్పోయింది. ఏళ్లు గడుస్తున్నా ఉదయ్‌కిరణ్‌ని అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నాం. ఈ రోజు ఉదయ్ కిరణ్ జయంతి కారణంగా ఆయన్ని ఓ సారి మననం చేసుకుందాం. ఎందరో యువ హీరోలు. అందులో కొందరే క్రేజీయెస్ట్ స్టార్లు. అందరి దారీ ఒకెత్తు. ఉదయ్‌కిరణ్ దారి మరో ఎత్తు. తొలి సినిమాకే బీభత్సమైన క్రేజ్ సంపాదించాడీ యంగ్ హీరో. ఆ తర్వాత చాలా హిట్ సినిమాలు ఉదయ్ కిరణ్ కెరీర్‌లో ఉన్నాయి.
లైఫ్‌లో ఎత్తు పల్లాలలనేవి చాలా సహజం. అయితే, వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవాలే తప్ప, ఓడిపోయామని భావించి బలవంతంగా ప్రాణం తీసుకోవడం సబబు కాదని ఉదయ్‌కిరణ్ వంటి నటున్ని చూసి అర్ధం చేసుకోవాలి. బోలెడంత వయసు, కెరీర్‌లో ఎంతో భవిష్యత్ ఉన్న ఉదయ్ కిరణ్ అర్ధాంతరంగా తనువు చాలించడం చాలా బాధాకరమైన విషయం. యూత్‌ని దారుణంగా కలిచి వేసిన దుర్ఘటన ఇది. ఆయన చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేని వారు ఇంకా చాలా మందే ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. అదీ ఉదయ్ కిరణ్ అంటే.