కొత్త వాళ్ళతో కొత్త కొత్త ఆలోచనలతో తెరకెక్కే సినిమాలు చాలావరకు తెలుగు ప్రేక్షకుల్ని ఇటీవలి కాలంలో ఆకట్టుకుంటూనే ఉన్నాయి. 'పెళ్ళిచూపులు' సినిమా ఆ కోవలోకే వస్తుంది. అలాంటిదే ఇంకో సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. అదే 'రెండు రెళ్ళ ఆరు'. చాలాకాలం క్రిందట వచ్చిన 'రెండు రెళ్ళ ఆరు' అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఆ టైటిల్‌తో కొత్త కాన్సెప్ట్‌తో ఇప్పుడు మళ్ళీ 'రెండు రెళ్ళ ఆరు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు జంటలు, ఆ జంటలకు ఓ అమ్మాయి, ఓ అబ్బాయి. అబ్బాయి కావాలనుకున్న జంటకి అమ్మాయి, అమ్మాయి కావాలనుకున్న జంటకి అబ్బాయి. దాంతో రెండు జంటలూ తమ పిల్లల్ని మార్చుకుంటాయి. ఆ రెండు జంటలూ ఓ అవగాహనతో ఎదురెదురు ఇళ్ళలోనే ఉంటాయి. ఆ జంటలకు పుట్టిన అమ్మాయి, అబ్బాయి ఒకర్నొకరు ప్రేమించుకుంటారు. అదిరింది కదూ కాన్సెప్ట్. అందుకే తెలుగు ప్రేక్షులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. చిన్న సినిమా అయినా కాన్సెప్ట్ కొత్తగా ఉంటే హిట్ గ్యారంటీ అనే అంశాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. వారాహి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకున్న చిత్రంగా 'రెండు రెళ్ళ ఆరు' మిగిలిపోతుందని అనుకోవచ్చు. 'పెళ్లి చూపులు' సినిమా తర్వాత ఆ స్థాయిలో ప్రశంసలు ఈ సినిమాకి దక్కుతున్నాయి.