సినిమాల్లో రీ-ఎంట్రీ ఇస్తున్నా.. అని కొన్నాళ్ళ క్రితం రేణు దేశాయ్ అధికారికంగా ప్రకటించిన విషయం విదితమే. ‘బద్రి’, ‘జానీ’ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్‌ని వివాహమాడటం, కొన్ని కారణాలతో ఇరువురూ విడిపోవడం తెలిసిన సంగతులే. పవన్‌తో ముడిపెట్టి రేణు దేశాయ్‌ని కొందరు తరచూ వివాదాల్లోకి లాగుతుంటారు. ఆ సంగతి పక్కన పెడితే, మహేష్ నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాలోనూ, మరో సినిమాలోనూ రేణు దేశాయ్ కీలక పాత్రల్లో నటించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ విషయాలపై రేణు దేశాయ్ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. నిజానికి, రేణుపై గాసిప్స్ రావడం, వాటిని ఆమె ఖండించడం కొత్తేమీ కాదు. పదే పదే ఆమె తన మీద వస్తున్న గాసిప్స్ ఖండిస్తూనే వున్నా, ఎందుకో ఆమెపై అనవసర గాసిప్స్ కాస్త ఎక్కువగానే వస్తున్నాయి. దీనిపై ఆమె స్పందిస్తూ, ఇలాంటి గాసిప్స్ ఎలా వస్తాయో నాకు తెలియడంలేదు.. బహుశా నా పేరుతో పబ్లిసిటీ చేసుకోవాలని కొందరు అనుకుంటున్నారేమో.. అంటూ రేణు దేశాయ్ ఈ మధ్యనే ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది.
కాగా, రేణుదేశాయ్ రీ-ఎంట్రీ (నటిగా) ఇస్తోన్న సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోందట. ఆ సినిమా వివరాలు ప్రస్తుతానికి సస్పెన్సనని అంటున్నారు. త్వరలో ఆమె ఓ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం కూడా వుందట.