ఓ పక్క టాలీవుడ్‌లో మహిళా ఆర్టిస్టులపై లైంగిక దాడులు అంటూ శ్రీరెడ్డి దుమారం ఇలా జరుగుతుండగానే, మరో పక్క కాశ్మీర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం అనే దుర్భరమైన సంఘటన వెలుగు చూసింది.
నిజానికి ఇలాంటి దుర్ఘటనలు కొత్తేమీ కాదు. చాలా మితిమీరిపోయాయి ఈ మధ్య. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలను విధించడంలో మన చట్టాలు, కోర్టులు విఫలమవడంతోనే ఈ రకమైన దుర్ఘటనలు మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయి. 'ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడాలంటే, వెన్నులో వణుకు, గుండెల్లో భయం పుట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి..' అని పవన్ కళ్యాణ్ మాజీ భార్య సినీ నటి అయిన రేణూ దేశాయ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆడపిల్లలుగా పుట్టడమే పాపమైపోయింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆఖరికి కన్నతండ్రే కూతురు పాలిట కసాయి వాడిలా మారిపోయే దుర్భర పరిస్థితులు మనం మన సమాజంలో చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి నుండి బయట పడాలంటే, ముందు జనంలో చైతన్యం రావాలి. ఏదో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు నలుగురూ బయటికి వచ్చి, ర్యాలీలు చేపట్టి, నినాదాలు చేయడం సరికాదనీ, ఇలాంటి దశ్చర్యలకు పాల్పడే వారికి అప్పటికప్పుడే కఠిన శిక్షలు అమలయ్యే కఠిన చట్టాలు మన ప్రభుత్వం తీసుకురావాలి అప్పుడు కానీ, ఇలాంటి హృదయ విదారక ఘటనలకు చరమ గీతం పాడలేము అని రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పేర్కొంది.