దేవాకట్టాది ఓ ప్రత్యేకమైన స్టైల్. ప్రస్థానం సినిమాతోనే తన శైలి తెలిసిపోయింది. ఆటోనగర్ సూర్య ఫ్లాప్ అయినా, అందులోనూ తనదైన మార్క్ ఉంటుంది. ఇప్పుడు `రిపబ్లిక్` తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఐశ్వర్య రాజేష్ నాయిక. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబరు 1న విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వచ్చింది. చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ ని ఆవిష్కరించారు.
సాయిధరమ్ తేజ్ కలెక్టర్ గా నటించిన చిత్రమిది. రమ్యకృష్ణ ఓ పొలిటికల్ లీడర్. తనతో.. కలెక్టర్ కి ఉన్న వైరమేమిటి? ఈ రాజకీయ వ్యవస్థని ఎదిరించి, చట్టాన్ని, ధర్మాన్ని ఓ కలెక్టర్ ఎలా కాపాడాడు? అనేదే ఇతివృత్తం.
''అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది... కలెక్టర్`` అంటి డైలాగులు టీజర్లో ఆకట్టుకున్నాయి. ఆలోచన, ఆవేశం ఉన్న పాత్రలో తేజ్ నటన, రమ్యకృష్ణ డిగ్నిటీ, మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, దేవాకట్టా డైలాగులు... ఈ ట్రైలర్ పై మంచి ఇంపాక్ట్ ని కలిగించాయి. ఓ పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్ చూసి చాలా కాలమైంది. ఆ లోటుని రిపబ్లిక్ తీరుస్తుందేమో చూడాలి.