చిటికెలో సినిమాలు తీయడం ఎలా? థియేటర్లు లేకపోయినా వాటిని విడుదల చేసుకోవడం ఎలా...? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే వర్మని ఫాలో అయిపోవాల్సిందే. లాక్ డౌన్ సమయంలో షూటింగులు లేక జనాలంతా బేజారైపోతుంటే, వర్మ మాత్రం ఎంచక్కా సినిమాల మీద సినిమాలు వదులుతున్నాడు. ఈ లాక్ డౌన్ సమయంలోనే క్లైమాక్స్, నగ్నం సినిమాల్ని పూర్తి చేసి వదిలేశాడు వర్మ. ఇప్పుడు `ట్వల్ ఓ క్లాక్` అనే మరో సినిమానీ పూర్తి చేశాడు. ఇప్పుడు టీజర్‌నీ వదిలాడు.
ఇదో హారర్ సినిమా. చాలా రోజుల తరవాత మళ్లీ హారర్ జోనర్ ని టచ్ చేశాడు వర్మ. మకరంద్ దేశ్‌పాండే, మిథున్ చక్రవర్తి, దిలీప్, అలీ అజహార్, ఆశీష్ విద్యార్థి.. ఇలా పేరున్న నటీనటులే కనిపించారు తెరపై. అంతేకాదు.. కీరవాణి సంగీతం, అమోల్ రాథోడ్ కెమెరా ట్రిక్కులు ఈ సినిమాకి బలాన్ని తీసుకురానున్నాయి. ఎప్పుడూ కొత్త వాళ్లతో ట్రై చేసే వర్మ, ఈసారి పేరున్న సాంకేతిక నిపుణుల్ని ఎంచుకున్నాడు. వర్మ సినిమాల్లో తరచూ చూసే హారర్ ట్రిక్కులు తెరపై మరోసారి దర్శనమివ్వబోతున్నాయి. నేపథ్య సంగీతం హోరెత్తిపోతోంది. ఇది కూడా ఓటీటీ కోసమే తీసినట్టు స్పష్టం అవుతోంది. కాకపోతే.. ఇది వరకటి సినిమాలకంటే క్వాలిటీ కనిపిస్తోంది. మరి వర్మ ఈసారి ఎలా భయపెడతాడో చూడాలి.