థియేటర్లు లేకపోవడం, అవి ఎప్పుడు తెరుస్తారో తెలియకపోవడం వల్ల... ఓటీటీ వైపు చూస్తోంది చిత్రసీమ. రేట్లు కాస్త తక్కువే అయినా, బడ్జెట్‌కీ ఓటీటీ వాళ్లు ఇచ్చే దానికీ పొంత లేకపోయినా, ఓటీటీకే సినిమాని అమ్ముకోవాలనుకుంటున్నారు. అయితే... ఓటీటీలోకి వచ్చిన ప్రతీ సినిమా వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతోంది. బాలీవుడ్ లో పది సినిమాలు విడుదలైతే అందులో ఒక్కటీ ప్రేక్షకాదరణ పొందలేదు. తెలుగులోనూ అంతే. పెంగ్విన్, అమృతారామమ్, 47 డేస్.. ఇవన్నీ ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలం అయ్యాయి. పరిస్థితి చూస్తుంటే, ఫ్లాప్ సినిమాలకు ఓటీటీ కేరాఫ్ గా నిలుస్తుందేమో అన్న భయం, అనుమానం కలిగాయి.
అయితే... వరుసగా ఓ రెండు మంచి సినిమాలు ఓటీటీలోకి విడుదలై, కాస్త ఉపశమనం కలిగించాయి. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన `కృష్ణ అండ్ హిజ్ లీల` మంచి టాక్ సంపాదించుకుంది. ఆహాలో ప్రదర్శితమవుతున్న భానుమతి రామకృష్ణకీ మంచి రివ్యూలొచ్చాయి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పాజిటీవ్ కామెంట్స్ రావడంతో.. చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది. ఇలాంటి విజయాలు ఓటీటీ విడుదలకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. జులైలో ఓటీటీ విడుదలలు ఎక్కువగానే ఉన్నాయి. తెలుగులోనూ కొన్ని సినిమాలు రాబోతున్నాయి. వాటిలోనూ ఇలాంటి మంచి సినిమాలుంటే.. ఓటీటీపై మరింత భరోసా పెరగడం ఖాయం.