సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్‌ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి యాంగిల్ నుండి ఈ సినిమా ఉండబోతోందని ఆయన ఆల్రెడీ ప్రకటించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఈ సంగతి తెలిసిందే. వర్మ, ఎన్టీఆర్ బయోపిక్ అనుకున్నప్పటి నుండీ రాజకీయాల పరంగా పలు వివాదాలు తలెత్తుతాయనీ, కొన్ని కొన్ని బెదిరింపులకు గురి కావల్సి వస్తుందనీ ఓ వర్గం వాదన. అయితే ఎలాంటి బెదిరింపులనైనా తిప్పి కొట్టే సామర్ధ్యం వర్మకుందన్న సంగతి చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాకి నిర్మాతగా సి. రాకేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈయన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే. ఈయనకు ఎన్టీఆర్ అంటే చాలా అభిమానం. ఈ సినిమాకి ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదనీ, అలాగే ఏ వైపు నుండి ఎలాంటి బెదిరింపులు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాననీ ఆయన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని వర్మ తెలిపారు. అక్టోబర్‌లో సినిమాని విడుదల చేస్తారట. నటీనటులు వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు వర్మ. అలాగే 'కోట్లాది మంది అభిమానుల అభిమానాన్ని పొందిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్. ఆయన జీవితం అంటే మహాభారతం లాంటిది. అందులోంచి నేను ఒక్క అధ్యాయాన్ని మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తున్నాను. అయితే నేను తీయబోయే సినిమాని సినిమాగా మాత్రమే చూడండి. కానీ రాజకీయ కోణంలోంచి చూడొద్దు..' అని వర్మ తెలిపారు.