క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న 'ఎన్‌టిఆర్ బయోపిక్' భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న సంగతి తెల్సిందే. స్టార్ కాస్టింగ్ పరంగా చూస్తే 'ఎన్‌టిఆర్ బయోపిక్' ప్రి రిలీజ్ బిజినెస్ కనీ వినీ ఎరుగని స్థాయిలో జరిగే అవకాశం వుందని ఎవరైనా ఓ అంచనాకు రావడం సహజమే. అందులో నిజం కూడా లేకపోలేదు.
ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కి వర్మ, సింపుల్‌గా చెక్ పెట్టేశాడు 'లక్ష్మీస్ ఎన్టీఆర్'తో. వర్మ గతంలోనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని ప్రకటించినా, దాన్ని మధ్యలోనే వదిలేశాడని అందరూ అనుకున్నారు. అయితే, సినిమా నిర్మాణం దాదాపు ఓ కొలిక్కి వచ్చేసిందనీ, చాలావరకు షూటింగ్ అయిపోయిందనీ గాసిప్స్ అప్పట్లో రావడం గమనార్హం. ఇలా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై అనుమానాలు, ఊహాగానాలు.. అన్నిటికీ వర్మ చెక్ పెట్టేశాడు. దసరా పండక్కి 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై కీలక ప్రకటన చేశాడు.
అంతకు ముందు దేవుళ్ళను దర్శించుకున్నాడు.. భక్తుడిలా మారిపోయాడు. స్వర్గీయ ఎన్టీఆర్ రెండో సతీమణి లక్ష్మీ పార్వతితో కలిసి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి చెప్పేందుకు మీడియా ముందుకొచ్చాడు వర్మ. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించాక ఏం జరిగిందన్నది 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చూపించబోతున్నట్లు వర్మ చెప్పాడు. అంతే, బాలయ్య 'ఎన్‌టిఆర్ బయోపిక్' కంటే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఇప్పుడు అంతటా చర్చనీయాంశమయ్యింది. టీవీ ఛానళ్ళలో గంటల తరబడి ఈ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై కథనాలు షురూ అయ్యాయి. వర్మ తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వొచ్చుగాక, కానీ వర్మ ఇమేజ్ గ్రాఫ్ మాత్రం ఎప్పుడూ పడిపోదనడానికి ఇదే నిదర్శనం.
ఒక్క ప్రకటనతో, భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న 'ఎన్‌టిఆర్ బయోపిక్'ని 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మించిపోవడమంటే అది వర్మ గొప్పతనం కాక ఇంకేమిటి.?