రామ్‌గోపాల్ వర్మ ఆగస్టులో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ)' వీడియోని విడుదల చేశాడు. ఈ వీడియో విడుదలైన నాటి నుండీ వివాదాలు వర్మని వెంటాడుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి దాకా ఆ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా గడిపిన వర్మ, ఆ తర్వాత వివాదాల ఊబిలో కూరుకుపోయారు. వివాదాలు కొత్తేం కాకపోయినా వర్మకి, ఈ సారి వివాదాలు మాత్రం పోలీసుల విచారణల వరకూ వెళ్లిపోయాయి. అయినా కానీ మెల్లగా వర్మ తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
నాగార్జునతో వర్మ తెరకెక్కిస్తున్న యాక్షన్ సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా సూపర్ స్పీడుతో సాగుతోంది. ఓ పక్క 'జీఎస్టీ' వివాదాలు ఆయన్ని వెంటాడుతున్నా, ఈ సినిమాకి మాత్రం ఏ బ్రేకులూ పడడం లేదు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నానని వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు. నాగ్‌తో 'శివ' సినిమాని తెరకెక్కించి, సంచలనాలు సృష్టించిన వర్మ ఇప్పుడు తెరకెక్కిస్తున్న సినిమా కూడా అంతే సంచలనాలు సృష్టించబోతోందనీ టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
పక్కా యాక్షన్ ఎలిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాలో. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వస్తున్నాయట. యాక్షన్ ఎపిసోడ్స్‌ని తెరకెక్కించడంలో వర్మ ఏమాత్రం రాజీపడడం లేదట. అద్భుతమైన ఔట్‌పుట్ వస్తోందట.
నాగార్జున, వర్మపై పెట్టుకున్న కాన్ఫిడెన్స్‌కి ఈ సినిమా ఎంత మాత్రమూ తీసిపోదనీ చిత్ర యూనిట్ చెబుతోంది. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ త్వరలోనే రానుందని వర్మ తాజాగా ప్రకటించారు.