తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం 'కాలా'. ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్రం యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 'కాలా' టీజర్‌ని మార్చి 1న అఫీషియల్‌గా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని వండర్ బాల్స్ పతాకంపై హీరో ధనుష్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా 'మీరంతా ఏ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారో ఆ న్యూసే ఇది. ది వన్ అండ్ ఓన్లీ సూపర్‌స్టార్ ఛరిష్మా, స్టైల్ చూసేందుకు సిద్ధం కండి..' అంటూ టీజర్ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తూ ధనుష్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.
ఇకపోతే రజనీకాంత్ సినిమాలకు తమిళనాడులోనే కాదు, దేశం యావత్తూ అభిమానులున్నారు. 'కబాలి' చిత్రం విషయంలో దేశ వ్యాప్తంగా సంచలన స్థాయిలో పబ్లిసిటీ జరిగిన సంగతి తెలిసిందే. అయితే అనుకోకుండా ఆ సినిమా హైప్ క్రియేట్ అయిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. ఈ సారి సూపర్‌స్టార్‌తో ఎలాగైనా ఆయన స్థాయికి తగ్గ హిట్ కొట్టాలన్న కసితో 'కబాలి' సినిమాని తెరకెక్కించిన డైరెక్టర్ పా రంజితే ఈ 'కాలా' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలోనూ రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ పాత్రలోనే కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే, ఈ సినిమా తర్వాత రజనీకాంత్ సినిమాల్లో నటించరంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఆయన కొత్త చిత్రం అనౌన్స్‌మెంట్ జరిగింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కొత్త చిత్రం ఉండబోతోంది. ఈ వార్త నిజంగా రజనీ అభిమానులకు పండగే.