పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ ఇద్దరూ మంచి స్నేహితులు. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి - ఇలా ముచ్చటగా మూడు సినిమాలు తీశారు. అజ్ఞాతవాసి నిరాశ పరిచినా, మిగిలిన రెండూ సూపర్ హిట్లు. అత్తారింటికి దారేది అయితే - ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించింది. జల్సా సమయంలో త్రివిక్రమ్ పవన్‌కి బాగా దగ్గరైపోయాడు. అత్తారింటికితో ఆ బాండింగ్ మరింత బలపడింది. పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేంత చనువు ఇద్దరికీ ఉంది. పవన్ కల్యాణ్ పొలిటికల్ స్పీచులన్నీ త్రివిక్రమ్ రాసిస్తాడని జనం చెప్పుకుంటుంటారు. అయితే.. ఈమధ్య ఇద్దరిమధ్యా గ్యాప్ వచ్చినట్టు వార్తలొచ్చాయి.
ఇద్దరూ ఎడమొహం పెడమొహంలా ఉంటున్నార్ట. `అదేం కాదు.. మా మధ్య ఇదివరకటి స్నేహమే ఉంది` అని త్రివిక్రమ్ ఇది వరకే చెప్పాడు .అయినా ఆ వార్తలు ఆగడం లేదు. పవన్‌పై `పవర్ స్టార్` అనే సినిమా తీశాడు వర్మ. అందులో త్రివిక్రమ్ ని పోలిన పాత్ర ఉంది. ఓ సన్నివేశంలో పవన్ - త్రివిక్రమ్‌పై చేయి చేసుకున్నట్టు ఆ ట్రైలర్ లో చూపించారు. నిజంగా ఇదంతా జరిగిందా? అది వర్మ మార్కు కల్పితమా? అనే ఆసక్తి జనాల్లో ఉంది. నిజానికి అంత సీన్ అయితే జరగలేదు. ఇదంతా వర్మ కట్టు కథ. సినిమాలో ఏదో ఓ మ్యాజిక్ జరగాలి కదా. అందుకే ఇలాంటి సన్నివేశాలు రాసుకున్నాడు వర్మ. ఇలాంటి షాకింగ్ ఎఫెక్టు.. కాకమ్మ స్టోరీలూ ఈ సినిమాలో ఇంకెన్ని ఉంటాయో?