కరోనా దెబ్బకు థియేటర్లకు వెళ్లడానికే జనం భయపడిపోతున్నారు. పవన్ కల్యాణ్ - వకీల్ సాబ్ థియేటర్లే ఖాళీగా ఉన్నాయంటే, మిగిలిన సినిమాల గురించి ఏం చెప్పేది? గత వారం.. `ఆర్జీవీ దెయ్యం` విడుదలైంది. ఏమాత్రం హడావుడీ లేకుండా.
కరోనా కాలంలో, పైగా ఎప్పటిదో సినిమా, ఇప్పుడెందుకు చూస్తారు? ఎవరు చూస్తారు? అనే అనుమానాల మధ్య ఈ సినిమా వచ్చింది. అనుకున్నట్టే ఈ సినిమా డిజాస్టర్ అయిపోయింది. మామూలు డిజాస్టర్ కాదు. ఇలాంటి వసూళ్లు రాజశేఖర్ కెరీర్‌లోనే లేవు.
రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా కేవలం 8 లక్షలు సంపాదించింది. కనీసం... పేపర్లలో ఇచ్చిన యాడ్ల ఖర్చు కూడా కాదాయె. ఈ సినిమాకి తక్కువలో తక్కువ కోటి రూపాయలైనా ఖర్చయి ఉంటుంది. ఏడేళ్ల సినిమా కాబట్టి.. వడ్డీలన్నీకలుపుకుంటే మరో కోటి అవుతుంది. అంటే రెండు కోట్ల సినిమాకి 8 లక్షలు వచ్చాయా? దీనికంటే... సినిమాని విడుదల చేయకుండా ఆపేస్తే .. ఓ సినిమా ఆగిపోయిందన్న సానుభూతైనా ఉండేది. లేదంటే ఓటీటీకి ఇచ్చుకుని ఉంటే, కొద్దో గొప్పో రేటు వచ్చేది.