‘నేను ఇండియన్‌ని..’ అని చెబుతుంటుంది ఓ సారి. ‘నేను అమెరికన్‌ని..’ అని చెబుతుంటుంది ఇంకోసారి. ఇంతకీ, ఆమె ఎవరు.? ఏ దేశస్తురాలు.? భారతీయ మూలాలున్న అమెరికన్ అనడం సబబేమో. ఆమె ఎవరో కాదు రిచా గంగోపాధ్యాయ్. ‘లీడర్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్, అమెరికాలోనే పుట్టి.. అక్కడే సెటిలైంది. అమెరికన్‌నే పెళ్ళాడింది కూడా. అమెరికా రాజకీయాల పట్ల అవగాహన సహా వివిధ అంశాల్లో చాలా యాక్టివ్‌గా వుంటోంది ప్రస్తుతం రిచా గంగోపాధ్యాయ్.
ఎవరన్నా ఆమెను ‘ఇండియన్‌వి.. నీకెందుకు అమెరికా రాజకీయాలు.?’ అని ప్రశ్నిస్తే, ‘నేను భారతదేశ మూలాలున్న అమెరికన్‌ని..’ అని గర్వంగా చెబుతుటుంది. ఇక, తన పేరు గురించి చెబుతూ, తన అసలు పేరు ‘అంతర’ అంటూ పెద్ద కథే చెప్పింది. ‘అంతర అంటే, సాంగ్ ఆఫ్ హార్ట్’ అని తన పేరులోని అర్థం గురించి చెప్పింది రిచా గంగోపాధ్యాయ్. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పట్ల తనకు అమితమైన అభిమానం ఎప్పటికీ అలాగే వుంటుందని చెబుతోన్న రిచా, తాను అమెరికా పట్ల కూడా అంతే గౌరవ భావంతో వుంటానని తాజాగా వెల్లడించింది.
సోషల్ మీడియా వేదికగా ఎవరన్నా ఆమెను ట్రోల్ చేస్తే, ఆ ట్రోల్స్‌కి ఘాటుగా సమాధానం చెప్పడంలో అస్సలేమాత్రం రాజీపడదు. ఇక, సినిమాల్లో తిరిగి నటించే విషయమై తనకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలూ లేవని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చింది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిచా.