రొమాంటిక్ కింగ్ గా బాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన నటుడు రిషి కపూర్. రెండేళ్ల నుంచి కాన్సర్ తో పోరాడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. అయితే.. ఆయన చివరి క్షణాలు ఎంతో ఉల్లాసంగా, ఆనందంగా గడిచాయని ఆయనకు ట్రీట్‌మెంట్ చేసిన వైద్య సిబ్బంది తెలిపింది. ఆసుపత్రిలో అందరితోనూ జోకులు వేస్తుండేవార్ట. అందరినీ నవ్విస్తూ ఉండేవారట. తనని చూసి ఎవ్వరూ ఏడవకూడదని, తాను గుర్తొచ్చినప్పుడల్లా పెదాలపై చిరునవ్వే మెదలాలని చెబుతుండేవార్ట రిషి కపూర్.
ఆసుపత్రి మంచంమీదే ఉండి, కొత్త సినిమాల గురించి ఆరా తీసేవారని, ఆయనకు ఆహారం అంటే చాలా ఇష్టమని, రుచి కరమైన ఆహార పదార్థాలు తీసుకునేవారని ఆయన సిబ్బంది చెబుతున్నారు. కాన్సర్ విషయం తెలిసిన వెంటనే అమెరికాలో కొంతకాలం చికిత్స చేయించుకున్నారు రిషి కపూర్. అక్కడా రిషి కపూర్ అలానే ఉల్లాసంగా ఉండేవార్ట. అంత్యక్రియలు సింపుల్‌గా నిర్వహిస్తామని, లాక్ డౌన్ వల్ల అందరూ ఇంట్లోనే ఉండాల్సిన ఈ పరిస్థితుల్లో రిషిని చూడ్డానికి అభిమానులు ఎవరూ రావొద్దని, ఇంట్లోనే ఉండి, రిషి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయాలని, రిషి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.