తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతోన్న 'రోబో 2.0' సినిమా విడుదల విషయంలో గందరగోళం ఇంకా అలాగే కొనసాగుతోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా అలా వాయిదా పడుతూ వస్తోంది. దీపావళికి ఈ సినిమా రిలీజ్ అన్నారు. దాంతో దీపావళికి విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత జనవరిలో విడుదల అన్నారు. అప్పుడు మరికొన్ని సినిమాలు వెనక్కి తగ్గాయి. ఇంకొన్ని సినిమాలైతే, నిర్మాణ దశలోనే జాప్యం ప్రదర్శించాయి ఈ కారణంగా. అంతేకాదు కొన్ని చిన్న సినిమాలు, ఓ మోస్తరు పెద్ద సినిమాలు కూడా రేసులో వెనకబడిపోయాయి.
ఇప్పుడు ఏప్రిల్‌లో 'రోబో 2.0' రిలీజ్ ఉందంటున్నారు. ఇందుకోసం చిన్న సినిమాల సంగతి పక్కన పెడితే, పెద్ద సినిమాల నిర్మాతలే ఆందోళన చెందుతున్న పరిస్థితి. 'రోబో' సినిమా విషయంలో పరిస్థితి ఇలా ఉంటే, బాలీవుడ్‌లో మరో భారీ బడ్జెట్ మూవీ 'పద్మావత్' విషయంలోనూ ఇదే గందరగోళం నెలకొంది. డిశంబర్ 1న విడుదల కావాల్సిన సినిమా వివాదాల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా కారణంగా డిశంబర్‌లో విడుదల కావాల్సిన చాలా సినిమాలు వెనక్కి వెళ్లిపోయాయి. వివాదాలు తీవ్ర స్థాయిలో చుట్టుముట్టడంతో అప్పుడు 'పద్మావత్' విడుదల ఆగిపోయింది. దాంతో వెనక్కి తగ్గిన సినిమాల విడుదల పరిస్థితి అగమ్యగోచరమైపోయింది. ఇప్పుడీ సినిమా సెన్సార్ అయ్యి, వివాదాల నుండి కొంచెం పక్కకు తప్పుకుని మళ్లీ విడుదలకు సిద్ధమైంది. జనవరి 26న రిలీజ్ అవుతుందనుకున్న 'పద్మావత్' ఒక్క రోజు ముందుగా అంటే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది
. దీంతో ముందుగానే జనవరి 26న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాల నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలను తొక్కేస్తున్నాయనడానికి ఇదే పెద్ద నిదర్శనం. పెద్ద సినిమాలను ఈ వారం కాకపోతే, మరో వారం విడుదల చేసుకోవచ్చు. కానీ చిన్న సినిమాల విషయానికి వస్తే, ఆలస్యం అయిన కొద్దీ, నిర్మాతలకు మిగిలేది నష్టాలే. ఆ తర్వాత వాటికి ధియేటర్స్ దొరికే పరిస్థితి కూడా కనిపించదు. ఈ రకంగా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలను ఊహించని స్థాయిలో దెబ్బ తీస్తున్నాయి.