రజనీకాంత్ సినిమా అంటేనే ఓ ప్రభంజనం. భాషతో సంబంధం లేకుండా.. రజనీ సినిమాల్ని ఆదరిస్తుంటారు. తమిళం నుంచి అనువాదమైన ప్రతీ రజనీ చిత్రానికీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయి. `రోబో` అయితే... తెలుగు స్టార్ హీరోల చిత్రాలను మించి వసూళ్లు సాధించింది. అందుకే.. `రోబో 2.ఓ` మార్కెట్ కూడా అంతకు మించి ఉంటుందని ఆశించారు.
ఈ సినిమా దాదాపుగా రూ.100 కోట్లకు అమ్ముడుపోతుందని లెక్కలు గట్టారు. కానీ... ఈ సినిమా ఇప్పటి వరకూ ఎవరూ కొనలేదు. అలాగని లైకా ప్రొడక్షన్స్ సంస్థ అమ్మానూ లేదు. దానికి కారణం.. ఒక్కటే. ఈ సినిమా ఆలస్యం అవ్వవడం. ఇప్పటికే విడుదల తేదీ చాలాసార్లు వాయిదా వేశారు. దానికి తోడు... రజనీ సినిమాలన్నీ ఈమధ్య అట్టర్ ఫ్లాపులుగా నిలిచాయి.
కబాలి, కాలా తెలుగులో బాగా నిరాశ పరిచాయి. వాటికి కనీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు. అందుకే `రోబో 2.ఓ`ని కొనడానికి బయ్యర్లు భయపడ్డారు. కొంతమంది ధైర్యం చేసినా.. లైకా మూవీస్ భారీ రేట్లు చెప్పి హడలెత్తించింది. ఓ దశలో ఏసియన్ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని రూ.80 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ... విడుదల ఆలస్యం అవ్వడంతో అడ్వాన్సు వెనక్కి తీసుకుంది.
దాంతో ఇప్పుడు లైకా మూవీస్ నే ఈ చిత్రాన్ని తెలుగులోనూ సొంతంగా విడుదల చేస్తోంది. రూ.80 కోట్లకు తెలుగులో అమ్ముకునే ఛాన్స్ వచ్చి.. తృటిలో తప్పిపోయింది. మరి దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి.