ఏ పెద్ద సినిమా రాబోతున్నా... సినీ ప్రేక్షకులు, రివ్యూలను ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్లు ఉమర్ సంధు వైపు చూస్తుంటారు. ఈ సినీ విశ్లేషకుడు... అందరి కంటే ముందే రివ్యూ ఇచ్చి... సినీ ప్రేమికుల్ని షాక్ కి గురి చేస్తుంటాడు. ఓ రకంగా.. ఇండియాలో మొదటి రివ్యూ ఇచ్చేది ఈయనే. ఇప్పుడు `రోబో 2.ఓ` రివ్యూ కూడా చెప్పేశాడు. ఈ సినిమా ఓ అద్భుతమని, ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి సైంటిఫిక్ ఫాంటసీ సినిమా రాలేదని.. కితాబులు ఇచ్చేశాడు. ఏకంగా నాలుగు స్టార్లిచ్చి `బ్లాక్ బ్లస్టర్` అంటూ ముద్ర వేశాడు. భారతీయ సినీ ప్రేమికులు ఈ సినిమా చూసి గర్వపడాలని, శంకర్ సృష్టించిన పాత్రలకు జోహార్లు చెప్పాలని కొనియాడాడు ఉమర్.
మరీ ముఖ్యంగా... అక్షయ్ కుమార్ నటన, పాత్రలో తను చేసిన పరకాయ ప్రవేశం న భూతో న భవిష్యత్ అంటూ కొనియాడాడు. ఓ రకంగా ఈసినిమాకి తన పాత్రే ఆత్మ అని... మార్కులన్నీ అక్షయ్‌కి కట్టబెట్టాడు. మొత్తానికి ఈ సినిమా ఓ అపురూప దృశ్య కావ్యమని డిక్లేర్ చేశాడు ఉమర్. అయితే... ఉమర్ రివ్యూలు అన్ని వేళలా నిజం కావు. అజ్ఞాతవాసి, సర్దార్‌గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలకూ ఇలాంటి రివ్యూలే ఇచ్చాడు. అవి రెండూ డిజాస్టర్లు అయ్యాయి. మరోవైపు `రోబో 2.ఓ`కి సంబంధించి నెగిటీవ్ పబ్లిసిటీ ఎక్కువైంది.
ఈ సినిమాలో గ్రాఫిక్స్ తేలిపోయాయని, కథ, కథనాలు నేల విడచి సాము చేశాయని, వందల కోట్ల రూపాయల్ని శంకర్ బూడిదలో వేసిన పన్నీరు చేశాడని... అప్పుడే నెటిటీవ్ టాకులు ఊపందుకుంటున్నాయి. అయితే రజనీకాంత్ అభిమానులు ఇవేం పట్టించుకోవడం లేదు. బాక్సాఫీసు దగ్గర రజనీ సంచలనాలు సృష్టించడం ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు. మరి ఉమర్ ఇచ్చిన రివ్యూ గెలుస్తుందో, లేదంటే నెగిటీవ్‌కామెంట్లే నిజమవుతాయో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.