సినీ నటి రోజా వరుసగా రెండోసారి చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యురాలిగా విజయం సాధించారు. ఈ విజయంతో ఆమె మరో ఘనతను కూడా దక్కించుకోబోతున్నారు. అదే మంత్రి పదవి. త్వరలోనే ఆమె వైఎస్ జగన్ మంత్రి వర్గంలో కన్పిస్తారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. గెలిచినా ఓడినా మంత్రి పదవి ఖాయం అన్న లిస్ట్‌లో రోజా పేరు వైసీపీలో అందరికన్నా ముందే చేరిందట.
అది 2014 ఎన్నికల నాటి విషయం. అప్పట్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో రోజాకి మంత్రి పదవి దక్కలేదు. ఈసారి మాత్రం పక్కాగా రోజా మంత్రి అవుతారట. పైగా, గడచిన ఐదేళ్ళలో రోజా, వైసీపీ మహిళా నేతగా అత్యద్భుతంగా పనిచేశారు. అసెంబ్లీలో అధికారపక్షాన్ని నిలదీయడంలో రోజా చూపిన తెగువకి హేట్సాఫ్ అనాల్సిందే. కొన్ని వివాదాస్పద అంశాలతో రోజా వార్తల్లోకెక్కినా, తాజా గెలుపుతో ఆ వివాదాలన్నీ దాదాపు అటకెక్కిపోయినట్లే.
తొలిసారిగా ఎమ్మెల్యే అయిన రోజాకి అప్పట్లో అసెంబ్లీలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇకపై ఆమె స్వేచ్ఛగా అసెంబ్లీలో తన వాణి విన్పించడానికి ఆస్కారమేర్పడింది. సినీ పరిశ్రమకే చెందిన పలువురు ఈసారి ఎన్నికల్లో బాగానే హల్‌చల్ చేశారుగానీ, చాలామందికి ఓటమి తప్పేలా కన్పించడంలేదు. ఆ లిస్ట్‌లో పవన్‌కళ్యాణ్ కూడా వున్నారు.