కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మద్యాహ్నం 12 గంటలకు ట్రెండ్స్ దాదాపుగా తెలిసిపోతాయి. ఈ ఎన్నికల్లో చాలా మంది సినీ ప్రముఖులు పోటీ పడ్డారు. దేశ రాజకీయాల్లోనూ, ఏపీ రాజకీయాల్లోనూ సినీ ప్రముఖుల హవా ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ని తీసుకుంటే, నటులు, నిర్మాతలు రంగంలో నిలిచారు. అందరిలోకీ, పవన్ కళ్యాణ్ మీదనే ఎక్కువ ఫోకస్ ఉంది. గాజువాక, భీమవరం నియోజక వర్గాల నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. నందమూరి బాలకృష్ణ మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరో పక్క రెండోసారి ఎమ్మెల్యే అవ్వాలనే కసితో ఉన్నారు సినీ నటి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా. నటుడు శివ ప్రసాద్ మళ్లీ ఎంపీగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. నిర్మాత ఎమ్.వి.వి.సత్యనారాయణ విశాఖ నుండి లోక్‌సభకు బరిలో దిగారు. నటుడు, నిర్మాత నాగబాబు జనసేన పార్టీ తరపున నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గానికి అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సినీ నటి మాధవీలత బీజేపీ నుండి అసెంబ్లీకి పోటీ చేశారు.
పోటీ చేసినవాళ్లు, వారికి మద్దతుగా ప్రచారం చేసిన సినీ ప్రముఖులు ఎన్నికల ఫలితాల కోసం చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోజా విషయంలోనూ అంతే. ఆ మాటకొస్తే, అందరి పరిస్థితి ఇంతే. సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ అభిమాన తారలు గెలవడం ఖాయమని ఇప్పటికదాకా చేసిన హంగామా ఒక ఎత్తు. ఈ రోజు ఫలితాలు రావడం ఇంకో ఎత్తు. రాజకీయ తెరపై వెలిగే తారలేవో, వెలుగులు చాలని తారలెన్నో కాసేపట్లో తేలిపోతుంది.