సినీ నటులు ఆలీ, మోహన్‌బాబు రాజకీయాల్లో బంపర్ ఛాన్స్ కొట్టేయనున్నారు. ఇద్దరూ వైసీపీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేశారు. వైసీపీ ఘన విజయం సాధించింది. మంత్రి పదవి హామీతో అలీ టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. మరోపక్క మోహన్‌బాబుకు రాజ్యసభ హామీ దక్కినట్లు వార్తలొచ్చాయి. అయితే, మారిన సమీకరణాల బట్టి రాజ్యసభకు అలీని పంపిస్తారనీ, మోహన్‌బాబును మంత్రిగా చేయొచ్చని అంటున్నారు. మోహన్‌బాబు కనుక మంత్రి అయితే, ఎమ్మెల్సీ కోటాలో ఆయనను చట్ట సభల్లోకి తీసుకెళ్లొచ్చు.
తద్వారా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అసెంబ్లీలో మోహన్‌బాబు ద్వారా గట్టి కౌంటర్లు ఇవ్వొచ్చన జగన్ భావిస్తున్నారట. వైఎస్ కుటుంబంతో మోహన్‌బాబుకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. మోహన్‌బాబు కోడలు వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహిత బంధువు. సరిగ్గా ఎన్నికల ముందర తిరుపతిలో తన విద్యాసంస్థల ఎదుట చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసి, వార్తల్లోకెక్కారు. ఆ వెంటనే ఆయన వైసీపీలో చేరారు. ఏది ఏమైనా ఏపీ రాజకీయాల్లో ఈ సారి సినీ గ్లామర్ కొంచెం ఎక్కువే కనిపించొచ్చు. ప్రధానంగా వైసీపీలో చాలా మంది సినీ ప్రముఖులు కనిపిస్తున్నారు.