టాలీవుడ్ లోనే కాదు, భారతీయ చలన చిత్రసీమలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది... RRR. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రమిది. రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్ తప్పనిసరి. ఈ సినిమాకీ వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పటికైతే దాదాపుగా 450 కోట్ల వరకూ లెక్క తేలుతోంది. సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ వడ్డీల భారం పెరుగుతుంది. రిలీజ్ అయ్యే సరికి బడ్జెట్ మరో వంద కోట్లు పెరిగినా ఆశ్చర్యం లేదు. అంటే దాదాపు 550 కోట్లన్నమాట.
ఇదంతా రికవరీ చేసుకోవాలి, సినిమా లాభాల బాట పట్టాలి అంటే దాదాపు 1000 కోట్లు తెచ్చుకోవాలి. రాజమౌళి సినిమా, అందులోనూ మల్టీస్టారర్ కాబట్టి, బిజినెస్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. కేవలం తెలుగు నుంచే 250 కోట్లు రావొచ్చు. కానీ... అది సరిపోదు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా ఆడాలి. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రికార్డు వసూళ్లు సాధించాలి. బాలీవుడ్ గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. రాజమౌళి సినిమా కాబట్టి అక్కడ కూడా క్రేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. బాలీవుడ్ లో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరచుకోలేదు. కేరళలోనూ అలాంటి పరిస్థితే ఉంది. తెలుగులో తప్ప, సినిమా చూసే మూడ్ ఎక్కడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెయ్యి కోట్లు తెచ్చుకోవడం కాస్త కష్టమే. అయితే నాన్ థియేటరికల్ రైట్స్ రూపంలో RRR భారీ మొత్తంలో సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. ఆ లెక్కన... సగం బడ్జెట్ వెనక్కి వచ్చినట్టే. ఊహించని స్థాయిలో భారీ లాభాలు రావాలంటే మాత్రం బాక్సాఫీసు దగ్గర వాతావరణం ప్రశాంతంగా ఉండాల్సిందే. కరోనా భయాలుంటే మాత్రం ఈ లెక్క తప్పడం తథ్యం.