రాజమౌళి సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. బాహుబలి తర్వాత ఏదో చిన్న సినిమా చేస్తానని చెప్పాడు కానీ, అనుకోకుండా చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ సెట్టయ్యింది. చిన్న సినిమా, ఎలాంటి గ్రాఫిక్స్, ఎఫెక్ట్స్ లేకుండా లో బడ్జెట్ మూవీ తీయాలని రాజమౌళి అనుకున్నాడు. కానీ కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకున్నాడు తప్ప స్టార్ హీరోలతో అదీ డబుల్ ధమాకా ఆఫర్ తగిలింది 'ఆర్‌ఆర్‌ఆర్' రూపంలో.
ఇక ఈ సినిమా కథా కమామిషు, బడ్జెట్ విషయానికి వస్తే, బాహుబలితో పాటు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలకు కథలందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి అద్దిరిపోయే కథ సిద్ధం చేశారట. ఇకపోతే బడ్జెట్ విషయం అంటారా.. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భరత్ అనే నేను'తో ఈ ఏడాది హిట్ కొట్టిన ఆయన తదుపరి చరణ్‌తో 'వినయ విధేయ రామ' చిత్రం నిర్మిస్తున్నారు. ఆ తర్వాత ఈ బ్యానర్‌లో రూపొందే అతి పెద్ద చిత్రం ఈ 'ఆర్‌ఆర్‌ఆర్'.
అందుకే ఈ చిత్రం బడ్జెట్ విషయమై ఆయన్ని అడిగితే ఇంతా.. అంతా అని చెప్పలేను. అక్కడున్నది ఇద్దరు స్టార్ హీరోలు వంద కోట్లు, ఆ పైన ఎంత పెట్టినా తక్కువే.. అవుతుంది. అందుకే సినిమాకి ఎంత అవసరమో అంతా ఖర్చు చేస్తానని ఆయన అంటున్నారు. ఈ సినిమా కోసం ఆల్రెడీ ఓ పెద్ద సెట్ వేశారట. అందులో వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట.
దీంతో పాటు మరో మేజర్ సెట్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయట. రాజమౌళి దర్శకత్వం అంటే 'ఆర్‌ఆర్‌ఆర్'ని 'బాహుబలి'తో కంపేర్ చేయడం సహజమే అయినా, బాహుబలిలా ఈ సినిమాకి ఖర్చు చేస్తారా.? లేక అంతకుమించి బడ్జెట్ పెడతారా? అనేది వేచి చూడాల్సిందే.