గత మూడు నెలలుగా షూటింగులకు అనుమతి లేకపోవడంతో చిన్న సినిమాలు మొదలుకొని పెద్ద స్టార్ల సినిమాల వరకూ అన్నీ ఆగిపోయాయి. ఈమధ్యే తెలంగాణా ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇవ్వడంతో దర్శక నిర్మాతలు షూటింగులకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల్లో భారీ చిత్రమైన 'RRR' కూడా షూటింగుకు రెడీ అవుతోంది. అయితే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ముందుగా రెండు రోజుల పాటు మాక్ షూట్ నిర్వహించాలని 'RRR' టీమ్ నిర్ణయించారట. హీరోలు లేకుండా డూపులతో 50 మంది సిబ్బందితో ఈ రేపు, ఎల్లుండి ఈ ట్రయల్ షూట్ చేసేందుకు జక్కన్న టీమ్ రెడీ అవుతోందట.
ప్రభుత్వం వారు విడుదల చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ ఈ రెండు రోజుల పాటు షూటింగ్ జరుపుతారట. కొత్త పద్ధతులలో షూటింగ్ చేస్తే ఎటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు ఎదురవుతాయి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాలను తెలుసుకునేందుకు ఈ మాక్ షూట్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ ట్రయల్ షూట్ పై ఇండస్ట్రీలోని దర్శక నిర్మాతలు, హీరోలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట. ఒకవేళ అంతా సాఫీగానే ఉంది.. ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదని తేలితే మిగతా నిర్మాతలు కూడా షూటింగుల బాట పట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట.