వెండి తెర ధోనీ.. సుశాంత్ సింగ్ రాజ్ పుట్ అర్థాంతరంగా తన ఇన్నింగ్స్ డిక్లేర్ చేసేయడం భారత సినీ ప్రపంచాన్ని నివ్వెర పరిచేలా చేసింది. 34 ఏళ్ల వయసులో ఇంతటి కఠినమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడో అని సుశాంత్ సన్నిహితులు, స్నేహితులు బోరుమంటున్నారు. నిజానికి సుశాంత్ ఆశా జీవి. తనకంటూ కొన్ని కలలు ఉన్నాయి. జీవితంలో తప్పకుండా చేయాలి, సాధించాలి.. అనుకున్న విషయాలన్నింటినీ కలిపి ఓ లిస్టు తయారు చేశాడు. అవన్నీ కలిపితే 50 వరకూ ఉన్నాయి. ఎప్పటికైనా విమానం నడపాలన్నిది సుశాంత్ లక్ష్యం. అది తన మొదటి కల. సుశాంత్ మంచి క్రికెటర్. తన బ్యాటింగ్ నైపుణ్యం ఏమిటో ధోనీ సినిమాలో చూశాం.
అయితే తను కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్. అయితే ఎడమ చేత్తో క్రికెట్ ఆడాలని అనుకునేవాడట. దాన్ని కూడా తన కలల లిస్టులో చేర్చాడు. సుశాంత్‌కి పాటలంటే చాలా ఇష్టం. తనకు ఇష్టమైన పాటలకు స్వయంగా గిటార్ వాయించాలనుకున్నాడు. అందుకే గిటార్ నేర్చుకోవడం కూడా ఓ కలగా భావించాడు. మహిళలకు ఆత్మరక్షణ విద్య నేర్పించాలని, కనీసం పది మంది పిల్లల్ని అంతరిక్షం పంపించాలని, తాను ఒకప్పుడు చదువుకున్న హాస్టల్ లో ఓ రోజంతా మళ్లీ గడపాలని, ఓవారమంతా అడవిలో గడపాలని, ఓ పుస్తకం రాయాలని... ఇలా 50 కలలతో ఓ లిస్టు తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏ ఒక్కటీ తీరకుండానే ఆత్మహత్య చేసుకున్నాడు. కనీసం తన చివరి క్షణాల్లో అయినా ఆ లిస్టు చూసుంటే.. జీవితంపై ఆశ, భరోసా కలిగేవేమో..?