ఆర్.ఆర్.ఆర్... రిలీజ్ ఎప్పుడు? అభిమానులందరి ప్రశ్న ఇదే. జనవరి 7న విడుదల కావాల్సిన సినిమా ఇది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ పాటికి ఆర్.ఆర్.ఆర్ రికార్డుల గురించి మాట్లాడుకునేవాళ్లు. కానీ.. పరిస్థితులు అనుకూలించకపోవడంతో చివరి నిమిషాల్లో ఆర్.ఆర్.ఆర్. వాయిదా పడింది. దాంతో ఆర్.ఆర్.ఆర్ లేకుండానే సంక్రాంతి గడిచిపోయింది. మరి.. ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నదే పెద్ద ప్రశ్న. పాన్ ఇండియా సినిమా ఇది. దేశ వ్యాప్తంగా పరిస్థితులు అనుకూలిస్తే తప్ప, ఈ సినిమాని విడుదల చేయడం కుదరదు. అయితే ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ బృందం రెండు కొత్త రిలీజ్ డేట్లతో ముందుకొచ్చింది. మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న ఈచిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
పరిస్థితులు అనుకూలిస్తే.. మార్చి 18నే ఈ సినిమాని విడుదల చేస్తారు. లేదంటే ఏప్రిల్ 28న పక్కా. ఫిబ్రవరి నెలాఖరుకి ఈ విషయమై ఓ స్పష్టత వస్తుంది. ఫిబ్రవరి చివరి వారంలో పరిస్థితిని సమీక్షించి, అప్పుడు రిలీజ్ డేట్ నిర్ణయిస్తారు. ఫిబ్రవరి చివరి వారం నాటికి కరోనా కేసులు తగ్గి, మల్లీ పూర్వ స్థితి కి వచ్చేస్తే.. మార్చి 18న ఈ సినిమా వస్తుంది. మార్చి1 న ప్రమోషన్లు మొదలెట్టినా.. చేతిలో 18 రోజులు ఉంటాయి. కాబట్టి.. ప్రమోషన్లకు కావల్సినంత సమయం దొరికినట్టే. ఒకవేళ.. మార్చిలోనూ అదే పరిస్థితి ఉంటే.. ఏప్రిల్ లోనే ఈ సినిమా వస్తుంది.