తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫస్ట్ లుక్ కాస్సేపట్లో విడుదల కాబోతోంది. ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్‌ని కూడా విడుదల చేస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఈ లుక్ విడుదల కాబోతోన్న విషయం విదితమే. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్.. ఓ రేంజ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ రాబడుతోంది. అందులో రెండు చేతులు కన్పిస్తున్నాయి. ఒకటి నీటిని తలపిస్తోంటే, ఇంకోటి నిప్పుని తలపిస్తోంది. ఒకటి రావ్‌ుచరణ్ చేయి అనుకుంటే, ఇంకోటి ఎన్టీఆర్ చెయ్యి అనుకోవాలేమో. చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మెగా మల్టీస్టారర్ ఇది.
అయితే, దర్శకుడు రాజమౌళి, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఫస్ట్ లుక్ విషయమై అభిమానులకు బాధ్యతాయుతమైన హెచ్చరిక జారీ చేశాడు. ఫస్ట్ లుక్ వచ్చాక సెలబ్రేషన్స్ చేసుకోవద్దనీ, ఎవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దనీ, ఫ్లెక్సీల జోలికి వెళ్ళకూడదనీ విజ్ఞప్తి చేశాడు రాజమౌళి. మామూలుగా ఫస్ట్ లుక్ వస్తే, ఆ వెంటనే భారీ స్థాయిలో ఫ్లెక్సీలు రూపొందించడం అభిమానులకి అలవాటే. కానీ, ఇప్పుడు దేశంలో పరిస్థితి అందరికీ తెల్సిందే. మొత్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. కరోనా ఎఫెక్ట్ కారణంగా, ఒకర్ని చూసి ఇంకొకరు అనుమానించాల్సిన దుస్థితి దాపురించింది. ఈ నేపథ్యంలో సెలబ్రేషన్స్‌కి ఆస్కారం లేదు. దాంతో ఎన్టీఆర్ అభిమానులు, రావ్‌ుచరణ్ అభిమానులు ఒకింత డీలాపడాల్సి వస్తోంది.