గత రెండు మూడు నెలల నుండి తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా వినిపిస్తోన్న సమస్యలు ఇసుక, ఆర్టీసీ సమ్మె. ఈ రెండు సమస్యలూ.. తెలుగు ఇండస్ట్రీకి పెద్ద గుదిబండలా మారి, ప్రస్తుత సినిమాలను తీవ్ర నష్టాల్లో ముంచేస్తున్నాయి. ఏపీ లో ఇసుక దొరకడం గగనమైపోవడంతో... దీంతో ఇసుకతో ముడి పడి సాగుతున్న వివిధ రంగాలు.. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, కూలీలు దగ్గరనుంచీ.. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు ఇలా నిర్మాణ అనుబంధ రంగాల పై బతుకుతున్న లక్షలాది మంది కార్మికులకు పనులు లేక, సరైన ఆదాయం లేక అత్యంత ఇబ్బందికర పరిస్థితులతో అల్లాడిపోతున్నారు.
దయనీయంగా మారిన వారి జీవితాల ప్రభావం, సినిమాల పై బాగా పడుతుంది. ఏపీ లోని బిసి సెంటర్ల రెగ్యులర్ ఆడియన్స్ అందరూ.. ఇలా ఆర్ధిక ఇబ్బందులతో థియేటర్స్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. దాంతో పాజిటివ్ టాక్ వచ్చిన 'ఖైదీ' లాంటి సినిమాలు, అలాగే ప్రత్యేకంగా బిసి ఆడియన్స్ కోసమే తీసిన 'తెనాలి రామకృష్ణ' లాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చేతులు ఎత్తేస్తున్నాయి. కలెక్షన్స్ రాబట్టలేక నష్టాల బాట పడుతున్నాయి.
ఇక తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మె కూడా సినిమాల పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఆటో వాళ్ళు చార్జీ రేట్లను అమాంతం పెంచేయడం.. ఇక మెట్రో సామాన్య ప్రజానానికి అందుబాటులో లేకపోవడం, పైగా థియేటర్స్ అన్ని దూరదూరంగా ఉండటంతో.. దిగువ స్థాయి ప్రేక్షకులకు సినిమాలు చూడాలనే ఆలోచన కూడా కలగడం లేదు. మొత్తానికి ఏపీలో 'ఇసుక' మరియు తెలంగాణలో 'ఆర్టీసీ సమ్మె' కారణంగా.. ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు రెవిన్యూ పరంగా డిజాస్టర్‌లుగా మారుతున్నాయి.