ఈ మధ్య మన తెలుగు సినిమాలకు హిందీ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ దక్కుతున్న సంగతి తెలిసిందే. ఒకవైపు టీవీ చానల్స్ లోనూ మరోవైపు యూట్యూబ్ లోనూ డబ్బింగ్ సినిమాలను హిందీ ప్రేక్షకులు విపరీతంగా చూస్తున్నారు. దీంతో కొన్ని సినిమాలకు యూట్యూబ్ లో బిలియన్ల కొద్దీ నమోదవుతున్నాయి. తాజాగా ఈ విషయంలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం 'రుద్రమదేవి' అరుదైన ఫీట్ సాధించింది.
రుద్రమదేవి పాత్రలో అనుష్క నటించిన ఈ సినిమా 2015 లో విడుదలై ప్రేక్షకాదరణ దక్కించుకుంది. తాజాగా యూట్యూబ్ లో ఈ చిత్రం 150 మిలియన్ లకు పైగా వ్యూస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాలో రానా దగ్గుబాటి, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలో నటించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాలో గోన గన్నారెడ్డి అనే ప్రత్యేక పాత్రలో నటించి అందరినీ మెప్పించారు.
తెలుగు సినిమాలు ఈ విధంగా భారీ వ్యూస్ సాధిస్తూ ముందుకు దూసుకెళ్లడం ఆహ్వానించదగ్గ పరిణామమే చెప్పాలి. యూనివర్సల్ అప్పీల్ ఉండేలా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చేలా మన తెలుగు దర్శకులు సినిమాలు తెరకెక్కించడమే ఇందుకు కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.