నందమూరి బాలకృష్ణకు 2019 కలసి రాలేదనే చెప్పాలి. ఈయేడాది బాలయ్య నుంచి వచ్చిన మూడో సినిమా కూడా డిజాస్టర్‌గా మారిపోయింది. ఇది వరకు కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్ని బాలయ్య రంగంలోకి దింపాడు. అయితే అవి ఫ్లాపులుగా నిలిచాయి. ఇప్పుడు రూలర్ పరిస్థితి కూడా అంతే. బాలకృష్ణ - కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. శుక్రవారం విడుదలైంది. రొటీన్ కథ, పేలవమైన కథనంతో దర్శకుడు ప్రేక్షకులని విసిగించేశాడు. బాలయ్య స్టెప్పులూ, కొన్ని డైలాగులు తప్ప సినిమాలో విషయం లేదని తేలిపోయింది. వసూళ్లూ ఇప్పుడు అంతంతమాత్రంగానే వచ్చాయి.
తొలి రోజు దాదాపు 4 కోట్ల షేర్ తెచ్చుకుంది రూలర్. తొలి మూడు రోజులకు కలిపి 6.5 కోట్లే లెక్క తేలాయి. అంటే మిగిలిన రెండు రోజులకూ కలిపి 2.5 కోట్లు వచ్చాయన్నమాట. నైజాంలో 1.2 కోట్లు, సీడెడ్‌లో 1.6 కోట్లు, గుంటూరులో 1.35 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్లో ఇంకా దారుణం. అక్కడ ఈ సినిమాకి ఇప్పటి వరకూ 15 లక్షలే వచ్చాయి. దాదాపు 22 కోట్లకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అంటే దాదాపు మూడొంతులు నష్టపోవాల్సిందే అన్నమాట.