గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు చిరంజీవి. రాజకీయాల ప్రస్తావన ఎప్పుడొచ్చినా `నేను వాటికి దూరంగా ఉన్నా` అనే సమాధానం ఇస్తుండేవాడు. చిరు రాజకీయాల జోలికి వెళ్లడం లేదని, ఆయన పాలిటిక్స్ ఎప్పుడో మానేశారని అభిమానులు కూడా ఫిక్సయ్యారు.
కానీ ఉన్నఫళాన ఆయన రాజకీయాలు గుర్తొచ్చాయి. సడన్ గా పొలిటికల్ కామెంట్లు చేయడం మొదలెట్టారు. అదీ... మూడు రాజధానుల సమస్యపై మాట్లాడారు. జగన్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని, మూడు రాజధానులు ఉంటే, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చిరు అభిప్రాయపడ్డారు. అయితే చిరు కామెంట్లు ఏపీలో తీవ్రమైన చర్చకు, విమర్శలకు తావిచ్చాయి. తమ్ముడు పవన్ కల్యాణ్ మూడు రాజధానులకు వ్యతిరేకంగా గళం విప్పుతుంటే, చిరు సమర్థించడం కరెక్టు కాదని మెగా అభిమానులు అంటున్నారు. అంతేకాదు.. ఇన్నాళ్లూ రాజకీయాలపై మౌనంగా ఉన్న చిరుకి, ఇప్పుడే అవి గుర్తొచ్చాయా అంటే ఎద్దేవా చేస్తున్నారు. కొంతమందైతే చిరు వైకాపా నేతలకు అమ్ముడుపోయాడని ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. ఈలోగా `ఆ ప్రకటన నేను చేయలేదు` అంటూ మరో లేఖ చక్కర్లు కొట్టింది. అయితే... వివరణ లేఖ పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది. స్వయంగా చిరంజీవినే ఆ విషయం చెప్పారు. దాంతో రాజధానులపై చిరు ఇచ్చిన ప్రకటన పూర్తిగా అధికారికమే అని, ఆ మాటపై చిరు కట్టుబడి ఉన్నాడని తేలిపోయింది.
ఇప్పుడు చిరుని విమర్శించే వాళ్లు మరింత ఎక్కువయ్యారు. కాకపోతే చిరు సన్నిహితులు మాత్రం.. చిరు తన అభిప్రాయాన్ని చెప్పారని, అందులో తప్పేంటని అంటున్నారు. కాకపోతే... చిరంజీవిని మూడు రాజధానుల కోసం ఎవ్వరూ అడగలేదు. మీడియా ప్రశ్నించలేదు. అలాంటప్పుడు అనవసరంగా ఈ కెలుక్కోవడం ఎందుకు..? అడ్డంగా బుక్కయిపోవడానికి కాకపోతే..?