సీసీసీపై అప్పుడే విమ‌ర్శ‌లు మొద‌లైపోయాయ్‌!

మరిన్ని వార్తలు

క‌రోనా వ‌ల్ల ఇబ్బంది ప‌డుతున్న సినీ కార్మికుల‌ను ఆదుకోవాల‌న్న ఉద్దేశంతో సీసీసీ (క‌రోనా క్రైసెస్ ఛారిటీ) మొద‌లైంది. చిరంజీవి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ సంస్థ‌కు భారీగా విరాళాలు వ‌చ్చాయి. దాదాపు 7 కోట్ల వ‌ర‌కూ పోగ‌య్యాయి. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న నిరు పేద సినీ కార్మికుల‌కు బాస‌ట‌గా నిల‌వాల‌న్న‌ది ఈ ఛారిటీ ప్ర‌ధాన ఉద్దేశం. అయితే... ఆదిలోనే హంస పాదు అన్న‌ట్టు.. ఈ సీసీసీపై ఇప్పుడు విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. సీసీసీని ప్రారంభించిన ఉద్దేశం మంచిదే. కానీ... ఆచ‌ర‌ణ‌లో లోపాలున్నాయంటూ కొంత‌మంది సినీ పెద్ద‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

 

సీసీసీ ఆధ్వ‌ర్యంలో కొంత‌మంది నిరు పేద‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల్ని పంపిణీ చేసే కార్య‌క్ర‌మం మొద‌లైంది. అయితే ఈ స‌హాయం ఎంత మందికి అందుతుందో, ఏ స్థాయిలో అందుతోందో, నిత్యావ‌స‌రాల వ‌స్తువుల కింద ఏమేం పంపిణీ చేస్తున్నారో.. వివ‌రం తెలియ‌డం లేద‌ని, వీటిక‌స‌లు లెక్కాప‌త్రాలు ఉన్నాయా? అంటూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ కార్య‌క్ర‌మాన్ని చిరంజీవి బ్రైయిన్ ఛైల్డ్‌గా అభివ‌ర్ణిస్తున్నా, చాలామంది సినీ పెద్ద‌ల ఆలోచ‌న‌లు వీటి వెనుక ఉన్నాయ‌ని, అయితే వాళ్లెవ్వ‌రి పేర్లూ బ‌య‌ట‌కు రాకుండా ఇదేదో చిరంజీవి కార్య‌క్ర‌మం అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న పెద‌వి విరుపులు వినిపిస్తున్నాయి.

 

సీసీసీని చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ లో క‌లిపేశార‌ని, అక్క‌డి నుంచే సీసీసీ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ఇంకొంత‌మంది వాద‌న‌. వ‌చ్చిన డ‌బ్బు ఎంత‌? ఎంత ఖ‌ర్చు పెడుతున్నారు? ఎలా ఖ‌ర్చు పెడుతున్నారు? అనే విష‌యాలు అంద‌రికీ తెలిసేలా ఏదో ఓ ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని, అప్పుడే సీసీసీ వెనుక ఉన్న మంచి ఉద్దేశం సంపూర్ణంగా నెర‌వేరుతుంద‌ని కొంత‌మంది స‌ల‌హా ఇస్తున్నారు. సీసీసీని నిర్వ‌హిస్తున్న ఆ పెద్ద‌లు ఎవ‌రైతే ఉన్నారో, ఈ స‌ల‌హాని దృష్టిలో ఉంచుకుని ప్ర‌వ‌ర్తిస్తే... ఈ నింద‌ల‌కు స‌మాధానం చెప్పిన‌వాళ్ల‌వుతారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS