పవన్ కల్యాణ్ విజృంభిస్తున్నాడు. ఏపీ రాజకీయాల్లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా పవన్ గురించి మాటలే. అక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీనే. కానీ ఆ పార్టీ వాళ్లు కూడా చేయని విమర్శలు జగన్‌పై పవన్ చేస్తున్నాడు. దాంతో.. వైకాపా నాయకులు కూడా పవన్‌పైనే దృష్టి పెట్టాల్సివస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చాడు పవన్. అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచీ ఈ హీటు మరింత పెరిగింది. పైగా ఈ దేశానికి అమిత్ షా వంటి నాయకులు కావాలి- అంటూ సంచనల స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దాంతో పవన్ బీజేపీకి మిత్రుడే అని, త్వరలో జనసేన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని వైకాపా నేతలు అంటున్నారు.
పవన్ పార్టీని బీజేపీలో కలిపేస్తారని, అందుకు ప్రతిగా ఏపీలో సీఎం అభ్యర్థిగా బీజేపీ తరపున పవన్‌ని నిలబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇది ఎప్పటి నుంచో నడుస్తున్న విషయమే. ఇప్పుడు ఆ రూమర్లకు మరింత బలం వచ్చినట్టైంది. పవన్ ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చారు. అక్కడ ఎవరెవరిని కలిశారో తెలియదు. ఆ విషయాలన్నీ రహస్యంగా ఉంచారు. పవన్ ప్రధాన మంత్రిని, అమిత్ షానీ కలిశారని, వాళ్లు పవన్‌ని బీజేపీలోకి ఆహ్వానించారని, అందుకే పవన్ ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో త్వరలోనే పెనుమార్పులు సంభవించడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి పవన్ కేంద్రబిందువు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.