ఈమధ్య భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రాలన్నీ బోల్తా కొడుతున్నాయి. సగానికి సగం నష్టాలొస్తున్నాయి. దానికి 'రోబో 2.ఓ'నే పెద్ద ఉదాహరణ. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాల్లో '2.ఓ' ఒకటి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఈసినిమాతో దాదాపు వంద కోట్ల నష్టాలొచ్చినట్టు సమాచారం.
రోబో తరవాత అంతటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం 'సాహో'. ఇప్పటి వరకూ ఈ సినిమాపై 250 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తయ్యేసరికి 300 కోట్లు అయినా అవ్వొచ్చు. ఈ మొత్తం రాబట్టాలంటే దాదాపుగా 400 కోట్లు వసూలు చేయాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? అంటూ ట్రేడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పాన్ ఇండియా ఇమేజ్‌తో ఈ సినిమా విడుదలైనా, ఈ స్థాయి వసూళ్లు సంపాదించడం కష్టమే అని తేల్చేస్తున్నాయి. ఈ లెక్కలు అటు యూవీ క్రియేషన్స్‌నీ టెన్షన్‌లో పడేస్తున్నాయి.
'బాహుబలి' సిరీస్ విజయాలతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.ఆ ఎఫెక్ట్ సాహోపై తప్పకుండా ఉంటుంది. సాహోకి కనీ వినీ ఎరుగని ఓపెనింగ్స్‌రావడం ఖాయం. కానీ.. అవి ఎన్ని రోజులు నిలబడతాయన్నది సినిమా రిజల్ట్ పై ఉంటుంది. ఒకవేళ సినిమా బాగుంటే కనుక.. 400 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. అదే జరిగితే.. బాహుబలి తరవాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో (సౌతిండియా) మళ్లీ ప్రభాస్ సినిమానే నిలుస్తుంది.