ప్రభాస్ అభిమానులకు, సాహో టీమ్‌కీ, అంతెందుకు... చిత్రసీమకు పెద్ద షాక్ ఇది. ఆగస్టు 15న విడుదల అవ్వాలనుకున్న సాహోకి... ఇది ఎదురుదెబ్బే. ఎందుకంటే... సాహో టీమ్ నుంచి సంగీత దర్శకులు తప్పుకున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఎహసాన్ లాయ్ స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరు `సాహో` టీమ్ లో లేరు. ఈ సినిమా నుంచి నిష్క్రమిస్తున్నట్టు ఈ సంగీత త్రయం ట్విట్టర్ వేదిక ద్వారా ప్రకటించింది. సాహో దర్శకుడు సుజీత్‌కీ, శంకర్ ఎహసాన్ లాయ్‌కీ... సృజనాత్మక విబేధాలు వచ్చినట్టు తెలుస్తోంది.
శంకర్ ఎహసాన్ లాయ్ ఇచ్చిన ట్యూన్లు సుజిత్ కి నచ్చలేదట. దాంతో పలుమార్లు సుజిత్ ట్యూన్లు రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. సుజిత్ ఇన్నిసార్లు ట్యూన్లు రిజెక్ట్ చేయడం వల్ల.. అహం దెబ్బతిన్న సంగీత త్రయం ఈటీమ్ నుంచి తప్పుకొంది. ఇప్పటికే ఈ సంగీత దర్శకులు మ్యూజిక్ పూర్తి చేయాల్సింది. అయితే కేవలం రెండు ట్యూన్లు మాత్రమే ఫైనల్ అయ్యాయట. వాటిని ఇప్పుడు సాహోలో వాడడం లేదు.
ఇప్పుడు శంకర్ - ఎహ్‌సాన్ - లాయ్ స్థానంలో కొత్త సంగీత దర్శకుడ్ని ఎంచుకోవాల్సివుంది. వాళ్లు పాటలు ఎప్పుడు ఇస్తారో, వాటిని ఎప్పుడు తెరకెక్కిస్తారో? పైగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి. ఇదంతా పెద్ద పని. మరోవైపు ఆగస్టు 15న సాహోని విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికిప్పుడు సంగీత దర్శకుడు దొరక్కపోతే... విడుదల తేదీ కూడా ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. మరి ఈ విపత్కర పరిస్థితిని సాహో టీమ్ ఎలా ఎదుర్కుంటుందో చూడాలి.