సాహోతో పోరెందుకు మ‌న్మ‌థా..?

By iQlikMovies - June 12, 2019 - 18:30 PM IST

మరిన్ని వార్తలు

ఏ సినిమాకైనా ప్ర‌చారం అత్య‌వ‌స‌రం. తెర నిండా స్టార్లు ఎంత మంది ఉన్నా స‌రే - ఆ సినిమా జ‌నాల్లోకి వెళ్లాలంటే మాత్రం ప‌బ్లిసిటీ కావాల్సిందే. అందుకే టీజ‌ర్‌, ట్రైల‌ర్ల విష‌యంలో చిత్ర‌బృందం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. సినిమా విడుద‌ల‌కు ముందు ఎలాంటి టెన్ష‌న్ ఉంటుందో, టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కూ అలానే ఉంటుంది. సినిమా విడుద‌లైతే క‌ల‌క్ష‌న్ల గోల‌. ట్రైల‌ర్ అయితే వ్యూస్‌ల లెక్క‌. అందుకే టీజ‌ర్ విడుద‌ల చేస్తున్న‌ప్పుడు కూడా `పోటీ` లేకుండా చూసుకుంటారు. అయితే నాగార్జున మాత్రం ధీటైన పోటీదారుడ్ని చూసుకుని మ‌రీ త‌న టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తున్నాడు. నాగార్జున తాజా చిత్రం `మ‌న్మ‌థుడు 2`. ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. టీజ‌ర్ కూడా రెడీ అయ్యింది. గురువారం ఈ టీజ‌ర్‌ని విడుద‌ల చేస్తున్నారు. అయితే గురువార‌మే.. సాహో టీజ‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌స్తోంది.

 

సాహోపై బాలీవుడ్ వాళ్ల క‌న్ను కూడా ఉంది. బాహుబ‌లి త‌ర‌వాత ప్ర‌భాస్ రేంజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌భాస్ నుంచి ఒక్క స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చినా అది వైర‌ల్ అయిపోతోంది. ఇక టీజ‌ర్ వ‌స్తుందంటే ఆ హంగామా ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. టీజ‌ర్ పేరిట ఉన్న పాత రికార్డుల‌న్నీ సాహో బ‌ద్ద‌లు కొట్టేయ‌డం ఖాయం. అలాంటి స‌మ‌యంలో.. మ‌న్మ‌థుడు టీజ‌ర్ కూడా వ‌స్తోంది. అంద‌రి క‌ళ్లూ ప్ర‌భాస్ సినిమాపై ఉంటే... మన్మ‌థుడికి మైలేజీ ద‌క్కేదెలా? ఒక‌వేళ మ‌న్మ‌థుడు టీజ‌ర్ బాగున్నా - చర్చంతా సాహో గురించే ఉంటుంది. ఇలాంటి స‌మ‌యం చూసుకుని మ‌రీ టీజ‌ర్ ఎందుకు విడుద‌ల చేస్తున్నాడో. ఏమైనా.. గురువారం రెండు పెద్ద సినిమాల టీజ‌ర్లు విడుద‌ల అవుతున్నాయి. సినీ ప్రియుల‌కు డ‌బుల్ బొనాంజా దొరికిన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS