'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాతో ఫ్లాప్ చవి చూసిన మారుతికి 'ప్రతిరోజూ పండగే' రూపంలో తేజు హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం 'సోలో లైఫే సో బెటరూ' అనే సినిమాలో నటిస్తున్నాడు. కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు తేజు ఈ సినిమాతో. ఇక తాజాగా తేజు మరో ప్రాజెక్ట్‌ని లైన్లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనే 'ప్రస్థానం' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు దేవ కట్టా. 'ప్రస్థానం' తర్వాత నాగచైతన్యతో 'ఆటో నగర్ సూర్య' సినిమా తెరకెక్కించి ఫెయిల్యూర్ చవి చూశాడీ డైరెక్టర్. ఇప్పుడు మళ్లీ తేజుతో చేతులు కలిపి హిట్ కొట్టాలని చూస్తున్నాడట. వాస్తవానికి ఈయన ఆ సినిమా తర్వాత తెలుగులో సినిమాలకు దూరమయ్యాడు.
ఇటీవల హిందీలో తనకు బాగా కలిసొచ్చిన 'ప్రస్థానం' సినిమాని రీమేక్ చేశాడు. కానీ, తెలుగులో దక్కినంత ఆదరణ అక్కడ దక్కలేదు ఈ సినిమాకి. అయినా, దేవ కట్టా డైరెక్షన్ అంటే సమ్‌థింగ్ స్పెషల్. చాలా మంది ఆయన టేకింగ్ స్కిల్స్‌ని మెచ్చుకుంటుంటారు. అలా ఇప్పుడు తేజుతో ఆయన టేకప్ చేయబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందో కానీ, సిమిలారిటీస్ చూస్తుంటే, మారుతిలాగే మళ్లీ చైతూతో ఫ్లాప్ అయిన డైరెక్టర్ని తేజు హ్యాండిల్ చేస్తున్నాడు. చూడాలి మరి ఈ సారి కూడా తేజు ఖాతాలో హిట్ చేరుతుందేమో. తేజు రూపంలో దేవ కట్టా కూడా సక్సెస్‌తో బౌన్స్‌బ్యాక్ అవుతాడేమో.