మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌కి అదృష్టం కన్నా ముందు దురదృష్టం నడిచొచ్చేస్తోంది. ఏ సినిమా పట్టుకున్నా, ఫెయిల్యూరే అవుతోంది.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భారీ అంచనాలతో తెరకెక్కిన 'జవాన్', 'ఇంటెలిజెంట్' చిత్రాలు తేజుని గట్టెక్కించలేకపోయాయి. 'సుప్రీమ్'తో సూపర్ డూపర్ హిట్ కొట్టి, సుప్రీమ్ హీరో ట్యాగ్‌ని తన పేరు పక్కన చేర్చేసుకున్నా, ఆ తర్వాతి నుండీ తేజుకు మరో హిట్ దరి చేరలేదు. లవ్ స్టోరీల స్పెషలిస్ట్ కరుణాకరన్ సినిమా తేజును సేఫ్ జోన్‌లోకి తీసుకొస్తుందేమో అనుకుంటే, ఇది కూడా నెగిటివ్ టాక్‌నే సొంతం చేసుకుంది. ఎంతగా ప్రయత్నించినా, 'తేజ్ ఐ లవ్‌యూ'కి పోజిటివ్ టాక్ తీసుకురాలేకపోయారు.
ఇకపోతే తేజు తర్వాతి చిత్రం కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనుంది. కిషోర్‌కి 'నేను శైలజ' ట్రాక్ రికార్డు తప్ప మరోటి లేదు. అలాంటి డైరెక్టర్‌తో తేజు సినిమా అంటే ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్‌లో ఇప్పటి నుండే ఆందోళన మొదలైంది. ఇకపోతే తేజు ఫెయిల్యూర్స్ వెనక ఉన్న రీజన్ ఏంటంటే, కథల ఎంపికలో తేజు వెనకబడ్డాడనీ, ఒకే తరహా కథలను ఎంచుకుని బోరెత్తిస్తున్నాడనీ టాక్ ఒకటి ట్రెండింగ్‌లో ఉంది.
కథలను ఎంచుకోవడంలో ఏమాత్రం తొందరపడకుండా కాస్త ఆచి తూచి వ్యవహరిస్తే బావుంటుందనీ, విశ్లేషకులు సలహా ఇస్తున్నారట. ఇన్ని ఫెయిల్యూర్స్‌తో తేజు నిలబడాలంటే, అసలు సిసలు హిట్టు పడాల్సిందే తప్పదు. ఇవన్నీ ఆలోచించి తేజు ఓ నిఖార్సయిన ఆలోచనకు వచ్చాడట. అదేంటో త్వరలోనే చెబుతానంటున్నాడు. చెప్పేదాకా ఆగాల్సిందేగా.!