చేతబడి, బాణామతి, చిల్లంగి... ఇవన్నీ మూఢనమ్మకాలుగా చలామణీ అవుతున్నాయి. దేశం, ప్రపంచం ఎంత వృద్ధిలోకి వెళ్తున్నా, సాంకేతికత ఎంత అభివృద్ది చెందుతున్నా - ప్రజల మూఢ విశ్వాసాలు మాత్రం తగ్గలేదు. ఎక్కడో ఓ చోట అజ్ఞానం రాజ్యమేలుతూనే ఉంటోంది. ఇలాంటప్పుడే అసలైన నిజం తెలియజేయడానికి ఒకడు పుడుతుంటాడు. అలాంటి కథే... `విరూపాక్ష`.
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. కార్తీక్ దండు దర్శకుడు. ఈ చిత్రానికి `విరూపాక్ష` అనే టైటిల్ నిర్ణయించారు. ఈరోజు ఫస్ట్ గ్లిమ్స్ కూడా విడుదల చేశారు.
''అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢనమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనప్పుడు, ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం..''
అంటూ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఈ కథని పరిచయం చేశారు. ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. వచ్చే యేడాది ఏప్రిల్ 23న ఈ చిత్రాన్ని తీసుకొస్తారు.