'పిల్లా నువ్వు లేని జీవితం' చిత్రంతో తెలుగు చిత్రసీమకి పరిచయం అయిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రిలీజ్ అయిన 'రేయ్' మూవీ అంతంతమాత్రమే ఆడిన 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' మరియు 'సుప్రీమ్' చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. సాయి ధరమ్ తేజ్ కి ఈ రెండు సినిమాల తర్వాత ఏ సినిమా అంతగా కలిసిరాలేదు. 'తిక్క' నుండి మొన్న వచ్చిన 'ఇంటెలిజెంట్' వరకు వరుసగా అయిదు చిత్రాలు పరాజయం పాలయ్యాయి.
అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ తన రూట్ చేంజ్ చేసుకున్నాడు. యాక్షన్ సినిమాలు పక్కన పెట్టేసి ప్రేమ కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడు కరుణాకరన్ తో ఓ చిత్రం చేస్తున్నాడు. అదే 'తేజ్ ఐ లవ్ యు'. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కే. ఎస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ స్వరాలు అందిస్తున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో తేజ్ కి జోడిగా నటిస్తోంది.
టీజర్ తో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం వచ్చే నెల జూన్ 29 న విడుదలకి సిద్ధం అయింది. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా అయినా సరైన విజయాన్ని అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.