పవన్ కల్యాణ్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. `వకీల్ సాబ్`తో పాటుగా క్రిష్ సినిమానీ సమాంతరంగా మొదలెట్టాడు పవన్. ఆ తరవాత హరీష్ శంకర్ సినిమా ఓకే చేశాడు. ఇప్పుడు `అయ్యప్పయుమ్ కోషియమ్` రీమేక్‌కీ సై అన్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈలోగా చిత్రబృందం కథానాయిక వేట కూడా మొదలెట్టేసింది.
ఈ చిత్రంలో కథానాయికగా సాయి పల్లవి పేరు ఖరారు చేశారని వార్తలు వినవస్తున్నాయి. టాలీవుడ్‌లో సాయి పల్లవి క్రేజ్ మామూలుగా లేదు. వరుసగా పెద్ద సినిమాల ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇప్పుడు తెలుగు నాట మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సాయి పల్లవినే. పవన్ - పల్లవి జంట అయితే.. చూడ్డానికి బాగుంటుందని, ఇది తాజా కాంబినేషన్ కాబట్టి, సినిమాపై క్రేజ్ కూడా పెరుగుతుందని చిత్రబృందం భావిస్తోంది.
`అయ్యప్పయుమ్ కోషియమ్`లో కథానాయిక ప్రాధాన్యం అంతంత మాత్రమే. కాకపోతే... పవన్‌కి తగ్గట్టుగా తెలుగులో మార్పులు చేయాల్సివుంటుంది. అందులో భాగంగా కథానాయిక పాత్ర ప్రాధాన్యమూ పెంచి తీరాల్సిందే. అందుకే స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింపాలని చూస్తున్నట్టు భోగట్టా.