విరాటపర్వం కోసం సాయి పల్లవి చాలా కష్టపడింది. `ఇది సాయి పల్లవి సినిమా` అంటూ రానా సైతం ప్రచారం చేసి, ఈ సినిమా క్రెడిట్ మొత్తం సాయి పల్లవికే ఇద్దామనుకొన్నాడు. కానీ బాక్సాఫీసు దగ్గర ఫలితం తేడా కొట్టింది. మంచి సినిమా అన్నారు గానీ, వసూళ్లు ఇవ్వలేకపోయారు తెలుగు ప్రేక్షకులు.
ఇప్పుడు సరిగ్గా ఇదే సీన్.. `గార్గి`తో రిపీట్ అయ్యింది. సాయి పల్లవి ప్రధాన పాత్ర పోషించిన సినిమా `గార్గి`. ఈ వారమే విడుదలైంది. సినిమా చూసినవాళ్లంతా... సాయి పల్లవి నటనని మెచ్చుకొంటున్నారు. గొప్ప ప్రయత్నం అని కితాబులు ఇస్తున్నారు. మౌత్ టాక్ ఇంత బాగున్నా ఈ సినిమాకి కనీస వసూళ్లు లేవు. థియేటర్లలో జనాలు ఖాళీ. రూపాయి పెట్టుబడి పెడితే... రూపాయీ పోయినట్టే. ఈ సినిమా బాక్సాఫీసు పరంగా డిజాస్టర్. అంటే సాయి పల్లవి కష్టం మళ్లీ వృథా అన్నమాట.
ఈ సినిమాపై సాయి పల్లవి చాలా ఆశలు పెట్టుకొంది. సోలోగా ప్రమోషన్లు చేసింది. రానా, సూర్య లాంటి వాళ్లని కలిసి.. వాళ్లనీ ప్రచారంలో భాగస్వామ్యం చేసింది. అయితే... ఇవేమీ జనాల్ని థియేటర్లకు రప్పించడంలో ఉపయోగపడలేదు. ఇప్పుడు సాయి పల్లవి దగ్గరకు లేడీ ఓరియెంటెడ్ కథలతో వెళ్తే... ఇంకొంత కాలం ఆగమని.... సలహా ఇస్తుందేమో..?