టాలీవుడ్ లో థియేటర్ల పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది. జనాలకు థియేటర్లకు వెళ్లే ఆసక్తి లేకుండా పోయింది. మంచి సినిమా వచ్చి, మౌత్ టాక్‌తో.. సినిమాకి వెళ్దామన్న ఉత్సాహం వస్తే తప్ప.. ఎవ్వరూ ఇళ్లన నుంచి కదలడం లేదు. ఇదే సీన్ ఓవర్సీస్‌లోనూ కనిపిస్తోంది. ఈమధ్య ఏ తెలుగు సినిమా ఓవర్సీస్‌లో లాభాలు తెచ్చుకొన్న పాపాన పోలేదు. అన్ని సినిమాలకూ భారీ నష్టాలే మిగిలాయి. ఆఖరికి ఓవర్సీస్‌లో మంచి మార్కెట్ సంపాదించుకొన్న నాని సినిమా `అంటే సుందరానికీ..` కూడా నష్టాల బాట పట్టింది. ఇప్పుడు రామ్ సినిమా `ది వారియర్` పరిస్థితి కూడా అంతే.
రామ్ - లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా `ది వారియర్`. పక్కా మాస్, కమర్షియల్ సినిమా ఇది. బీ,సీలలో కాస్తో కూస్తో ఓపెనింగ్స్ దక్కాయి. ఏ క్లాసులో అయితే.. థియేటర్లు ఖాళీగా కనిపించాయి. ఓవర్సీస్‌లో అయితే మరీ ఘోరం. ఈ సినిమాని అక్కడ రూ.4 కోట్లకు అమ్మారు.
అయితే.. ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. టోటల్ రన్‌లో రూ.1 కోటి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అంటే.. దాదాపు రూ.3 కోట్ల నష్టమన్నమాట. అయితే ఏపీ, తెలంగాణలలో అసలు లెక్కలు ఇంకా బయటకు రాలేదు. వస్తే.. ఇక్కడ కూడా డిజాస్టర్‌గా పరిగణించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.