'సింగం' సిరీస్ సినిమాలతో సరికొత్త క్రేజ్ సంపాదించుకున్నాడు తమిళ హీరో సూర్య. తాజాగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో సూర్యకి జోడీగా ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ సినిమా సూర్యకి 36వ సినిమాగా తెరకెక్కుతోంది. ఇంతవరకూ 35 చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్న సూర్య, ఈ సారి సరికొత్తగా ఆకట్టుకోనున్నాడు. పూర్తి విభిన్నమైన కథా, కథనాలతో ఈ సినిమా తెరకెక్కుతోంది. జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది ఈ సినిమా. తెలుగులోనూ సెల్వ రాఘవన్‌కి డైరెక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. వెంకటేష్‌తో 'ఆడవారి మాటలకు అర్దాలే వేరులే' వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించి విజయం అందుకున్నాడు. హీరో సూర్యకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా వచ్చిన 'సింగం' సిరీస్ చిత్రాలూ తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టాయి.
ఇక ముద్దుగుమ్మ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. తెలుగులో ప్రస్తుతం సాయి పల్లవి మేనియా కొనసాగుతోందనే చెప్పాలి. 'ఫిదా'తో మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ తాజాగా నాని 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి'తో మంచి హిట్ అందుకుంది. శర్వానంద్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఇలా ఉంటే, తమిళంలో అగ్రహీరోల్లో ఒకరైన సూర్య సరసన హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుని, జాక్ పాట్ కొట్టేసిందనే చెప్పాలి.
ఇంతవరకూ యంగ్ హీరోస్‌తోనే నటించి మెప్పించిన సాయి పల్లవి ఈ సినిమాతో ఓ అగ్రహీరోతో నటించే అద్భుతమైన అవకాశం దక్కించుకుంది. హీరో పాత్రతో పాటు, హీరోయిన్‌గా సాయి పల్లవి పాత్రకూ ప్రాధాన్యత ఉంటుందట. కథా, కథనాలు చాలా కొత్తగా ఉండబోతున్నాయంటున్నారు. మరో పక్క సూర్య హీరోగా వస్తున్న 'తానా సేంద కుట్టం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.