ఇటీవల తమిళంలో విడుదలైన 'మారి 2' చిత్రంలో సాయి పల్లవి ఆటో డ్రైవర్‌గా నటించి మాస్ ఆడియన్స్ మెప్పు పొందింది. ఈ రౌడీ బేబీ ఇప్పుడు సైకిల్ తొక్కుతోందండీ. ఎందుకోసమంటారా.? 'విరాట పర్వం' సినిమా కోసం. రానా, సాయి పల్లవి జంటగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది. అంతలోనే ఫస్ట్ షెడ్యూల్ షూట్ కంప్లీట్ చేసుకుని ఆశ్యర్యపరుస్తోంది.
ఇక ఈ సందర్భంగా ఆన్ లొకేషన్ ఫోటోలు కొన్ని లీకయ్యి, నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిలో సాయి పల్లవి సైకిల్ తొక్కుతున్న ఫోటో ఒకటి ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇస్తోంది. సాయి పల్లవి అంటే నేచురల్ బ్యూటీ. ఈ నేచురల్ బ్యూటీ మరింత నేచురల్‌గా అచ్చమైన లంగా వోణీలో కనిపించి, రెండు జడలు వేసుకుని అలా సైకిల్ తొక్కుకుని వస్తుంటే కిక్ కాక ఇంకేంటి చెప్పండి. నక్సలిజం కంటెంట్‌తో పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది.
ఈ సినిమాలో సాయిపల్లవి, రానా ఇద్దరూ నక్సలైట్ల పాత్రలు పోషిస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే, ప్రజెంట్ సాయి పల్లవి లుక్ మాత్రం ఓ అచ్చమైన పల్లెటూరి యువతిలా కనిపిస్తోంది. ఈ స్టిల్‌ని బట్టి సినిమాలో ఆమె క్యారెక్టర్ ఇదే అని పక్కాగా అంచనా వేయలేం. కానీ, ఆ మాటికొస్తే, ఏ పాత్రైనా సాయిపల్లవికి కొట్టిన పిండే అనుకోండి. ఇకపోతే, ఈ సినిమాలో సీనియర్ నటి టబు, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'నీదీ నాదీ ఒకే కథ' ఫేం వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ భాగస్వామ్యం వహిస్తోంది.