శర్వానంద్ కొత్త సినిమా 'శ్రీకారం' ఆదివారం మొదలైంది. కిషోర్ రెడ్డి అనే కుర్రాడు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాలన్నది ప్లాన్. అయితే సంక్రాంతి రేసులో చాలా పెద్ద సినిమాలే ఉన్నాయి. మహేష్‌బాబు, అల్లు అర్జున్ సినిమాలు పండక్కి రాబోతున్నాయి. సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా 'ప్రతిరోజూ పండగే' కూడా సంక్రాంతికే విడుదల కాబోతోంది.
ప్రభాస్ 'జాన్' కూడా 2020 సంక్రాంతి టార్గెట్ చేసుకున్న సినిమానే అని తేలింది. నాగార్జున 'బంగార్రాజు' కూడా సంక్రాంతికే తీసుకొద్దామనుకుంటున్నార్ట. వీటిలో కనీసం మూడు సినిమాలైనా సంక్రాంతి బరిలో నిలవడం ఖాయం. వీటి మధ్య శర్వా కూడా వస్తే తప్పకుండా నలిగిపోతాడు. శర్వా ఎన్నో ఆశలు పెట్టుకున్న పడి పడి లేచె మనసు ఫ్లాప్ అయ్యింది. రణరంగం ఎలా ఉంటుందో తెలీదు.
ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి సీజన్‌లో బరిలోకి దిగుతున్నాడు. అదీ భీకరమైన పోటీలో. నిజంగా శర్వా పెద్ద రిస్కే చేస్తున్నాడు. గతంలో చిరంజీవి, బాలయ్య సినిమాలు ఉండగానే `శతమానం భవతి` విడుదల చేసి హిట్టు కొట్టాడు. మళ్లీ అదే ధైర్యంతో 'శ్రీకారం' కూడా పండక్కి తీసుకురావాలనుకుంటున్నాడేమో. మరి 'శతమానం భవతి' మ్యాజిక్‌ని 'శ్రీకారం' రిపీట్ చేస్తుందంటారా??