షార్ట్ ఫిల్మ్ టు సిల్వర్ స్క్రీన్... ఈతరం దర్శకుల్లో దాదాపు 70% ఇదే ఫార్ములా తో ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు. 'పెళ్లి చూపులు' సినిమా తో నేషనల్ అవార్డు రేంజ్ కి ఎదిన యువ దర్శకుడు.. 'తరుణ్ భాస్కర్' కూడా ఇదే ఫార్ములా వాడి దర్శకుడయ్యాడు. కానీ అది అంత సులభమైన పనేం కాదు. ఆ షార్ట్ ఫిల్మ్ లో హంగులు, అన్ని రకాల ఎమోషన్లు కనిపించాలి.. అప్పుడే అవకాశాలు, అంతకు మించి అనుభవం తోడవుతుంది. సరిగ్గా అలాంటి షార్ట్ ఫిల్మ్ తోనే తరుణ్ భాస్కర్ తనని తాను నిరూపించుకున్నాడు. అదే 'సైన్మా'.
'సైన్మా' తో వెండి తెరకు పరిచయమైన ఆణిముత్యాలు..
'అర్జున్ రెడ్డి' చిత్రం తో అందరినీ ఆకట్టుకున్న 'రాహుల్ రామ కృష్ణ' ఈ చిత్రం లో 'రాము' పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. 'టాక్సీ వాలా' తో పరిచయమైన 'విష్ణు'...'గలీజ్' పాత్ర పోషించాడు .. 'మను', 'ఫలక్ నామాదాస్' చిత్రాల్లో కనిపించిన 'జాన్ కొట్టోలీ' కూడా సైన్మా లో ఓ దర్శకుడి పాత్రలో నవ్విస్తాడు. ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారానే సంగీత దర్శకుడు 'వివేక్ సాగర్' కూడా వెలుగులోకి వచ్చాడు. తెలంగాణ యాసను హైలైట్ చేస్తూ.. ప్రేమ, స్నేహం మరియు అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని కలబోసిన ఎమోషనల్ కామెడీ కథ ఇది. ఈ బుల్లి సినిమా మొదలైనప్పటినుండి చివరి వరకు నవ్వుతూనే ఉండేలా తెరకెక్కించాడు దర్శకుడు తరుణ్. షార్ట్ ఫిల్మ్ ట్రెండ్ మార్చిన 'సైన్మా' నేటితో 4 ఏళ్ళు పూర్తి చేసుకుంది.