ఏదైనా సరే, మొహం మీదే మాట్లాడేయడం రిషి కపూర్ స్పెషాలిటీ. అభిమానులు అతని ధైర్యాన్ని చూసి మెచ్చుకునేవారు. కానీ.. అవే రిషి కొంప ముంచేవి. వివాదాల్ని ఏరి కోరి మరీ తనకు పూసుకోవడం రిషికి రాను రాను అలవాటుగా మారింది. ట్విట్టర్ వచ్చాక రిషి మరింత రెచ్చిపోయాడు. ఎన్నో కాంట్రవర్సీ ట్వీట్లు చేసి వివాదాల్లో దూరేవాడు. సల్మాన్ ఖాన్ - రిషి కపూర్ లమధ్య వివాదం ఎవరూ మర్చిపోలేరు.
ఓ పెళ్లిలో సల్మాన్ ఖాన్ మరదలితో రిషి అనుచితంగా ప్రవర్తించాడని ఓ వార్త అప్పట్లో గుప్పుమంది. అదే పార్టీలో సల్మాన్ - రిషి నువ్వంటే నువ్వుంటూ వాగ్వీవాదానికి దిగార్ట. అప్పుడే సల్మాన్ రిషిపై చేయి చేసుకున్నాడని చెప్పుకుంటారు. ఆ గొడవ చాలా కాలం కొనసాగింది. అయితే పెళ్లి పార్టీలో ఎవరు ఎవరిని ఏమన్నారో? ఎవరిది తప్పో.. ఈ విషయాలపై మాట్లాడడానికి రిషి కపూర్ ఎప్పుడూ ఇష్టపడలేదు. అయితే కొన్ని సమయాల్లో సల్మాన్ కి రిషి కపూర్ అండగా నిలిచాడు. ముఖ్యంగా కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నప్పుడు సల్మాన్ కి మద్దతు ప్రకటించాడు రిషి కపూర్. అప్పటి నుంచి సల్మాన్ - రుషి మళ్లీ భాయ్ భాయ్ అయిపోయారు. సినిమా వేడుకల్లో, వ్యక్తిగత వినోద కార్యక్రమాల్లో రిషి కపూర్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచేది.
ఓసారి ఆసిన్ పెళ్లిలోనూ రిషికపూర్ విచిత్రంగా ప్రవర్తించి వివాదాల్లోకి ఎక్కాడు. అసిన్ పెళ్లిలో తనకు అవమానం జరిగిందని, తనని ఎవరూ పట్టించుకోలేదని స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ షాక్ కి గురిచేశాడు. ఆ పెళ్లిలో ఓ పెద్ద ఫోకస్ లైట్ పెట్టాలని నిర్వాహకుల్ని డిమాండ్ చేసి, వాళ్లు పెట్టకపోవడంతో రిషి గొడవకు దిగాడట. అసిన్ పెళ్లిలో రిషి కపూర్ పెత్తనం ఏమిటని అప్పట్లో మీడియాలో రకరకాల కథలు వచ్చాయి. మహారాష్ట్రలో బీఫ్ ని నిషేధించినప్పుడు కూడా వివాదాస్పద కామెంట్లు చేశాడు. తాను బీఫ్ తింటానని బాహాటంగా ప్రకటించాడు. దాంతో ఓ వర్గం రిషిని వ్యతిరేకిస్తూ, నిరసన కార్యక్రమాల్ని చేపట్టింది. అయితే ఎవరితో గొడవకు దిగినా, ఆ గొడవని వెంటనే మర్చిపోవడం, గొడవకు దిగిన వాళ్లతోనే చెట్టాపట్టాలేసుకుని తిరగడం రిషికపూర్‌కి అలవాటు. శత్రువుల్ని సైతం మిత్రులుగా మార్చుకోవడాన్ని రిషి ఇష్టపడేవాడు. అందుకే... ఎలాంటి కాంట్రవర్సీలకు దిగినా, రిషి వాటిని దాటుకుని రాగలిగాడు.