సమంత నిర్మాతగా మారబోతోందట.. అయినాగానీ, ఆ సినిమాలో నటిస్తుందట. నటిస్తూ, ఓ సినిమా నిర్మించడానికి సమంత రంగం సిద్ధం చేసుకుంటోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో కొత్త సినిమా త్వరలోనే సెట్స్ మీదకు రానుందని టాలీవుడ్‌లో గుసగుసలు విన్పిస్తున్నాయి. తొలుత ఓ కొరియన్ సినిమాని రీమేక్ చేయాలని నందిని రెడ్డి - సమంత అనుకున్నారట. అయితే, రీమేక్ కంటే స్ట్రెయిట్ సినిమా వైపే సమంత మొగ్గు చూపిందనీ, ఈ నేపథ్యంలోనే నందిని రెడ్డి ఓ ఆసక్తికరమైన కథాంశాన్ని ఎంచుకుని, స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిందనీ అంటున్నారు.
నందిని రెడ్డి - సమంత కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ బేబీ’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంకో సినిమా అంటే ఆ సినిమాపై అంచనాలు భారీగానే వుంటాయి. ఇదిలా వుంటే, నందిని రెడ్డి దర్శకత్వం వహించబోయే ఆ సినిమాలో సమంత సరసన అక్కినేని నాగచైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందనీ, త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థని సమంత, అక్కినేని నాగార్జున చేతుల మీదుగా ప్రారంభించబోతోందనీ గుసగుసలు విన్పిస్తున్నాయి. మరి ఈ గాసిప్స్‌లో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.