తెలుగు చిత్రసీమలో అగ్రశ్రేణి కథానాయికగా చలామణీ అవుతోంది సమంత. తమిళం నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. `సూపర్ డీలక్స్`తో అక్కడ కూడా అభిమానుల్ని సంపాదించుకుంది. సమంత కోసం ఎప్పటికప్పుడు కథలు సిద్ధం అవుతున్నాయి. అయితే తన అభిమానులకూ, దర్శకులకూ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది సమంత. త్వరలో తాను సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నానని ప్రకటించింది. కేవలం రెండు మూడేళ్లు సినిమాలు చేస్తానని, ఆ తరవాత కుటుంబానికి పరిమితం అవుతానని ప్రకటించింది.
ఇది నిజంగా అభిమానులకు షాక్ ఇచ్చే విషయమే. సమంత ఫుల్ ఫామ్‌లో ఉంది. మరో ఐదేళ్ల పాటు తన ప్రభావం చూపించేంత స్టామినా ఉంది. ఇలాంటి సమయంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరమైన సంగతే. సమంత పెళ్లయ్యాక `సినిమాలు వదలను` అని చెబుతూ వస్తోంది. ఒకవేళ తల్లిగా మారినా, సినిమాల్ని వదులుకోను అంది. కానీ సడన్‌గా ఇలాంటి నిర్ణయం తీసేసుకుంది. సమంత దృష్టి ఇప్పుడు కుటుంబంపై పడింది. తల్లిగా ప్రమోషన్ పొందాలని ఆరాటపడుతోంది. తల్లయ్యాక ఎలాగూ సినిమాలకు దూరం అవ్వాల్సివస్తుంది. అందుకే ఈలోగా చక చక సినిమాలు చేసేయాలని భావిస్తోంది. అందుకే ముందే తన నిర్ణయం ప్రకటించేసింది. చూద్దాం.. రెండేళ్ల తరవాత తన నిర్ణయంలో మార్పు ఏమైనా వస్తుందేమో.?